– మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
– మూడవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
– శనివారం వంటావార్పు
భూదాన్ పోచంపల్లి, జనవరి 10 : కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి చేనేత సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరాయి. దీక్షలో భాగంగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ దీక్ష శిబిరాన్ని బూర నర్సయ్య గౌడ్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి చేనేత కార్మికులు పెద్ద స్ఫూర్తినిచ్చారన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని, మంత్రి పదవిని, ఆస్తిని, సొంత ఇంటిని త్యాగం చేశారని గుర్తు చేశారు. చేనేత కళాకారులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, కులవృత్తులు కుటీర పరిశ్రమలుగా కావాలన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమ పథకాలు, సంక్షేమం కోసం యాచించడం కాదు శాసించడం కావాలన్నారు.

Bhoodan Pochampally : చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
చేనేత రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు ప్రకటించి నేటికీ అమలు చేయకపోవడం విచారకరమన్నారు. చేనేత రుణమాఫీ, చేనేత భరోసా, త్రిఫ్ట్ స్కీం పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, 12 సంవత్సరాలు గడిచినా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలన్నారు. రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయకపోతే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాజకీయాలకతీతంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. చేనేత వర్గాలకు భరోసాని ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మెడలు వంచేలా తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడు గంజి బసవలింగం, బిజెపి మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర నాయకులు సురకంటి రంగారెడ్డి , పడమటి జగన్మోహన్ రెడ్డి , ఏలే చంద్రశేఖర్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్, అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, బిజెపి పట్టణ అధ్యక్షుడు డబ్బికార్ సాహెష్, పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేష్, రాష్ట్ర నాయకుడు ఏలే భిక్షపతి, కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు భారత భూషణ్, నాయకులు మంగళపల్లి శ్రీహరి, భారత బాలరాజు, వర్కాల వెంకటేశం, జోగు శ్రీనివాస్, ఏలే శ్రీను, భోగ రాములు, రుద్ర నరసింహ, పొడుగు బాలరత్నం, గంజి కృష్ణ, ఎల్లె షా, రచ్చ సత్యనారాయణ, తుమ్మ లక్ష్మీనారాయణ, వనం వెంకటేశ్ పాల్గొన్నారు.

Bhoodan Pochampally : చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం