Indian Navy : మరో నేవీ బేస్ (నౌకాదళ స్థావరం) ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. పొరుగునే ఉండి, ప్రమాదకరంగా మారుతున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ తీరం, బంగాళాఖాతంలోని, హల్దియాలో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని ఇండియన్ నేవీ భావిస్తోంది. ఇక్కడ స్వల్ప స్థాయి యుద్ధ నౌకల్ని మోహరించనుంది.
దీని ద్వారా భారత తీర రక్షణ దళం మరింత బలపడనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న నేవీ బేస్.. ఇప్పటికే అక్కడ ఉన్న డాక్ కాంప్లెక్స్ కు ఉపయోగపడుతుంది. అది కూడా తక్కువ స్థాయి నిర్మాణాలు, నౌకల ద్వారా త్వరగా సేవలందించేందుకు వీలవుతుంది. ఇక్కడ ఫాస్ట్ ఇంటర్ సెప్టార్ క్రాఫ్ట్స్, 300 టన్నుల న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వంటివి నిలిపేందుకు వీలుంటుంది. 40-50 నాట్ల వేగంతో వచ్చే నౌకల్ని కూడా నిలిపి ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తారు. అలాగే, ఆధునిక గన్స్, ఆయుధాలు ఉంచేందుకు అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో హిందూ మహా సముద్రం, బంగాళాఖాతంలో చైనా నేవీ దూకుడు చర్యలకు దిగుతోంది.
అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు కూడా జరుగుతున్నాయి. దీంతో సముద్ర జలాల్లో ట్రాఫిక్ పెరిగింది. ఇలాంటి పరిస్తితుల్లో కొత్త బేస్ భారత నౌకదళానికి అదనపు బలంగా మారుతుంది. ఇక్కడ వంద మంది వరకు నేవీ ఆఫీసర్లు, నావికా సిబ్బంది పని చేస్తారు. ఇది కోల్ కతాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.