అమరావతి : అమరావతి ( Amaravati ) నిర్మాణానికి వైసీపీ ఏనాడు వ్యతిరేకం కాదని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) పేర్కొన్నారు. అమరావతి నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని , అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు ( Chandra Babu ) స్కాంలకు పాల్పడుతుండడాన్ని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు.
వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొబలైజేషన్ అడ్వాన్స్లతో బాబు టీం దోచుకుంటుందని మండిపడ్డారు. జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని విమర్శించారు. అమరావతిలో రైతుల వద్ద నుంచి సేకరించిన భూములకు వాటిలో రైతులకిచ్చిన ప్లాట్ల వద్దకు వెళ్లడానికి కనీసం రోడ్లు కూడా లేవని అన్నారు.
మొదటి విడతలో సేకరించిన 50 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు కావాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని వివరించారు. ఈ సమయంలో మరో 50 వేల ఎకరాలు సేకరణకు సిద్ధమవుతున్నారని దీనికి మరో లక్ష కోట్లు అవసరముంటుందని తెలిపారు. అమరావతి టెండర్లలో కూడా కొద్ది కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి పాలన రెండేళ్లు కాకుండానే రూ.3 లక్షల కోట్లు అప్పుడు చేశారని విమర్శించారు.