Rahul Gandhi | లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ టీవీ చానల్ మహిళా యాంకర్ రాహుల్‌ను ప్రశ్నించారు. ‘మీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అదానీ కంపెనీతో దావోస్ వేదికగా రూ. 2,400 కోట్ల ఎంవోయూ చేసుకొంది. దీనిపై ఏమంటారు? అదానీ డీల్‌తో మీ పార్టీ ఏ సందేశం ఇస్తుంది’ అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ.. ‘అదానీ అరెస్టవ్వాలి. ఆయనతో అంటకాగిన వాళ్లెవరైనా.. ఏ పార్టీ వారైనా.. శిక్ష ఎదుర్కోవాలి’ అని బదులిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..
‘లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ర్టాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. అది బీజేపీ అయినా, మరే ఇతర పార్టీ అయినా.. విచారణ జరిపించాల్సిందే’ అని డిమాండ్ చేశారు. కాగా, దావోస్ వేదికగా రేవంత్ ప్రభుత్వం అదానీ కంపెనీతో రూ. 12,400 కోట్ల పెట్టుబడుల ఒప్పందం చేసుకొంది. అనంతరం స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం ప్రకటించడం చర్చనీయాంశమైంది. అదానీ వ్యవహారంపై ప్రధాని స్పందించాలని తృణమూల్ నేత కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరపాలని సీపీఎం పేర్కొన్నది. పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఆరోపణలపై ఆదానీ సంస్థనే సమాధానం ఇచ్చుకోవాలని, చట్టం తన పని తాను చేస్తుందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర పేర్కొన్నారు.