జగిత్యాల : వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ( Gas Price ) ధరను ఏకంగా రూ. 993 పెంచడం పట్ల జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ( Dava Vasantha Suresh ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆరు సార్లు పెంచి చిరువ్యాపారులకు ఉపాధిని, ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపడం దారుణమని అన్నారు.
చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు మూతపడి వాటిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారని అన్నారు. కార్మిక దినోత్సవం నాడు సిలిండర్ ధరలు పెంచి ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల నడ్డి విరిచారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.