Digestive System | ప్రస్తుత కాలంలో జీవనశైలి మార్పులు, ప్రాసెస్డ్ ఆహారం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎక్కువమందిలో కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో బయటికి కనిపించే లక్షణాలనే పట్టించుకుంటారు కానీ వాటి మూల కారణం గట్ (జీర్ణ వ్యవస్థ) ఆరోగ్యంతో సంబంధం ఉండొచ్చని గుర్తించరు. అందుకే గట్ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఇక శరీర ఆరోగ్యానికి గట్ (Gut) ఎంత ముఖ్యమో కొత్త పరిశోధనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సెకండ్ బ్రెయిన్ గా పిలిచే గట్ సరిగా పనిచేయకపోతే, అది కేవలం జీర్ణక్రియకే కాకుండా మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. 16వ ప్రోబయోటిక్ సింపోజియంలో నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్లో 10 మందిలో 7 మంది ఏదో ఒక గట్ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడైంది.
గట్ అసమతుల్యత (Gut Imbalance) అనేది చాలా సార్లు స్పష్టంగా కనిపించని లక్షణాల ద్వారా బయటపడుతుంది. వీటిని సాధారణంగా గమనించకుండా వదిలేస్తారు. అయితే ఈ సంకేతాలను ముందుగానే గుర్తిస్తే, ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. గట్ అసమతుల్యతను సూచించే సంకేతాల గురించి వైద్యులు వివరిస్తున్నారు. గట్ అసమతుల్యతకు ఒక ముఖ్య సంకేతం తలలో నిరంతరం చుండ్రు లేదా దురద. గట్లో ఇన్ఫ్లమేషన్ పెరిగితే అది చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత కోల్పోతే ఈ సమస్యలు వస్తాయి. అలాగే కారణం తెలియని అలసట కూడా గట్ సమస్యలకు సంకేతంగా నిలుస్తుంది. సరిపడా విశ్రాంతి తీసుకున్నా కూడా అలసటగా అనిపిస్తే, అది శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా శోషించకపోవడం వల్ల అవుతుంది.
మూడవ లక్షణం మూడ్ స్వింగ్స్ లేదా ఆందోళన. గట్, మెదడు మధ్య ఉన్న సంబంధం (గట్-బ్రెయిన్ యాక్సిస్) వల్ల గట్ ఆరోగ్యం ప్రభావితం అయితే సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గి భావోద్వేగాల్లో మార్పులు వస్తాయి. అలాగే బ్లోటింగ్ (ఉబ్బరం), అసమాన మల విసర్జన కూడా గట్ సమస్యలకు ప్రధాన సంకేతాలు. ఇవి ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఈ లక్షణాలు నిరంతరం ఉంటే వైద్యులను సంప్రదించడం అవసరం. చక్కెర పట్ల ఆకర్షణ పెరగడం కూడా గట్ అసమతుల్యతకు మరో సూచన. గట్లో చెడు బ్యాక్టీరియా పెరిగితే అవి చక్కెరపై ఆధారపడతాయి. దీంతో తీపి తినాలనే కోరిక పెరుగుతుంది. చర్మంపై మొటిమలు లేదా బ్రేకౌట్స్ రావడం కూడా గట్ ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటుంది.
అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల గట్ బలహీనపడి చర్మ సమస్యలు పెరుగుతాయి. తరచూ జలుబు, ఇన్ఫెక్షన్లు రావడం లేదా రోగనిరోధక శక్తి తగ్గడం కూడా గట్ సమస్యల వల్లే జరుగుతుంది. ఎందుకంటే శరీరంలోని 70 ఇమ్యూన్ కణాలు గట్లోనే ఉంటాయి. ఇక గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం, తగినంత నీరు తాగడం అవసరం. అలాగే సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ, రోజువారీ వ్యాయామం కూడా ముఖ్యమైనవి. గట్ ఆరోగ్యం శరీర మొత్తం ఆరోగ్యానికి పునాది. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే వైద్యులను సంప్రదించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.