Road accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జయరాం (27) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముదినేపల్లి మండలం చినపాలపర్రు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముదినేపల్లి మండలం వనుదుర్రు గ్రామానికి చెందిన జయరాం.. బంధువుల వివాహ వేడుక కోసం ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు.
పెళ్లి వేడుకలు ముగియడంతో జయరాం తిరిగి అమెరికా వెళ్లేందుకు శనివారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరాడు. కారు చినపాలపర్రు వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది. దాంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. జయరాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి వచ్చి తిరిగి వెళుతున్న యువకుడు ఇలా విగతజీవిగా మారడంతో వనుదుర్రు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.