Kollywood | తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ‘రెవెన్యూ షేరింగ్ విధానం’పై చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు భారీగా పెరగడం వల్ల నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రెమ్యునరేషన్ వ్యవస్థలో మార్పులు కోరుతూ తమిళ నిర్మాతలు నిరసన బాట పట్టారు. తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పిలుపు మేరకు మే 2న టోకెన్ సమ్మె నిర్వహించడంతో, శనివారం కోలీవుడ్‌లో అన్ని సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. ముఖ్యంగా, ‘రెవెన్యూ షేరింగ్ విధానం’ అమలు చేయాలని నిర్మాతల మండలి డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ అంశంపై నడిగర్ సంగం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
నిర్మాతల అభిప్రాయం ప్రకారం, ఒక సినిమా విఫలమైతే మొత్తం నష్టాన్ని వారు ఒంటరిగా భరించాల్సి వస్తోంది. గత మూడేళ్లలో స్టార్ హీరోలు, టాప్ టెక్నీషియన్స్ పారితోషికాలు అమాంతం పెరగడం వల్ల ప్రాజెక్ట్ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో చిన్న, మధ్య తరహా నిర్మాతలు కొత్త సినిమాలు ప్రారంభించడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ‘రెవెన్యూ షేరింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్మాతలు సూచిస్తున్నారు. ఈ విధానం ప్రకారం, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ముందుగా భారీ పారితోషికం తీసుకోవడం బదులుగా, సినిమా విడుదల తర్వాత వచ్చిన లాభాల్లో వాటా పొందాలి. ఇలా చేస్తే నష్టాలు తగ్గడమే కాకుండా, సినిమాల విజయశాతం కూడా పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.
ఇదే విధానాన్ని బాలీవుడ్లో ఇప్పటికే పలువురు స్టార్ నటులు అనుసరిస్తున్నారని నిర్మాతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ వంటి ప్రముఖులు ఈ మోడల్‌ను పాటిస్తున్నారని తెలిపారు. అలాగే, ఇతర పరిశ్రమలలో సినిమా ఫ్లాప్ అయినప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాతలకు మద్దతుగా నిలుస్తారని, కానీ తమిళ పరిశ్రమలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నటులు ఇతర భాషా సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా స్థానిక నిర్మాతలపై ప్రభావం చూపుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, పరిశ్రమలో ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని, అందరికీ న్యాయం జరిగే విధంగా కొత్త విధానం అమలు కావాలని కోరుతూ ఈ టోకెన్ సమ్మె చేపట్టినట్లు నిర్మాతల మండలి వెల్లడించింది. ఇక ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో, నటీనటుల సంఘం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.