సామాన్యుడి నడ్డివిరుస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నది. ఇంధన ధరలను పెంచడంలో ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి అందనంత ఎత్తులో ప్రధాని మోదీ నిలిచారు. అంతేకాదు ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మూడో స్థానం, డీజిల్ ధరల విషయంలో ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మేరకు ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ గణాంకాలతో సహా కుండబద్దలు కొట్టింది. ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఈ మేరకు వివరించింది.
PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. 2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. గ్యాస్, పెట్రో ధరల పెంపులో మోదీ సర్కారు కొత్త రికార్డులను నమోదు చేసింది.
ప్రపంచంలో మరే ఇతర దేశాధినేతకు సాధ్యంకాని ఫీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతం చేసుకొన్నారు. ప్రజలపై ఇంధన భారాన్ని అత్యధికంగా మోపిన ప్రధానుల్లో మోదీ నంబర్ 1 ప్లేస్‌లో నిలిచారు. అంతేకాదు.. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్ రేటులో మూడు, డీజిల్ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ సమాధానాలు ఇచ్చింది.
గ్రోక్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారు. పదకొండేండ్ల మోదీ పాలనలో దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతున్నది.
గ్రోక్: పీపీపీ ఆధారంగా గణిస్తే.. ప్రపంచ దేశాల్లోకెళ్లా భారత్‌లోనే ఎల్పీజీ సిలిండర్ ధర అత్యధికంగా ఉన్నది. భారత్‌లో ఒక సిలిండర్‌ను కొనుగోలు చేయడానికి 43 పీపీపీ డాలర్లను వెచ్చించాల్సి వస్తున్నది. అమెరికా, బ్రిటన్, చైనాతో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలతో పోల్చిచూసినా ఇది ఎంతో ఎక్కువ.
గ్రోక్: పెట్రోల్ రేటు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. డీజిల్ రేటులో ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించింది. ప్రజల కొనుగోలు శక్తి తుల్యత ఆధారంగా గణిస్తే.. లీటర్ పెట్రోల్ కోసం సగటు భారతీయుడు 5 పీపీపీ డాలర్లను, లీటర్ డీజిల్ కోసం 4.3 పీపీపీ డాలర్లను వెచ్చించాల్సి వస్తున్నది.
గ్రోక్: 2014 మేలో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 105-110 డాలర్ల మధ్య ఉండేది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ. 71.51, లీటర్ డీజిల్ రూ. 57.28, ఎల్పీజీ రూ. 399గా ఉండేది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల ముడిచమురు 60 డాలర్లకు లభిస్తున్నా ఎల్పీజీ లీటర్ పెట్రోల్ ధర రూ. 107కు చేరింది. లీటర్ డీజిల్ రూ. 95గా ఉన్నది. ఎల్పీజీ ధర రూ. 920కు చేరింది. 2014 నుంచి 2025 వరకూ పెట్రోల్ ధర 40 శాతం మేర, డీజిల్ ధర 60 శాతం మేర, గ్యాస్ ధర 130 శాతం మేర పెరిగింది.
గ్రోక్: పీపీపీ ఆధారంగా భారత్‌లోని సగటు పౌరుడు తాను సంపాదించే రోజువారీ ఆదాయంలో 19.6 శాతం మొత్తాన్ని పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం ఖర్చు చేస్తున్నాడు. ఒక పౌరుడి ఆదాయం రోజుకు రూ. వెయ్యి అనుకొంటే ఇందులో రూ. 196ను గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం ఖర్చు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.
వేర్వేరు దేశాల ఆర్థిక వ్యవస్థని పోల్చి చూడడానికి ఆర్థిక వ్యవస్థ పరిమాణం, తలసరి ఆదాయం లాంటి అంశాలు మాత్రమే సరిపోవు. అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఆదాయాలు రూ. 40 లక్షల స్థాయిలో ఉంటే, భారత్ వంటి దేశాల తలసరి ఆదాయాలు రూ. లక్ష లేదా లక్షన్నర దగ్గరే ఉంటున్నది. తలసరిని మాత్రమే ఆధారంగా తీసుకొంటే, అమెరికా తలసరి జీవన ప్రమాణాల స్థాయికీ, భారత జీవన ప్రమాణాల స్థాయికి 40 రెట్ల వ్యత్యాసం ఉండాలి. కానీ, అలా ఉండదు. కాబట్టి, దీన్ని ఇంకా మెరుగ్గా అంచనా వెయ్యడానికి తీసుకొచ్చిన పరిమితినే పర్చేజింగ్ పవర్ పారిటీ (ప్రజల కొనుగోలు శక్తి తుల్యత-పీపీపీ)గా చెప్తున్నారు.
పీపీపీ గురించి వివరంగా చెప్పాలంటే.. భారత్‌లో కిలో ఆలుగడ్డలు రూ. 40గా ఉంటే, అమెరికాలో కిలో ఆలుగడ్డల రేటు 3 డాలర్లు (రూ. 258). అంటే కిలో ఆలుగడ్డలను కొనుగోలు చేయాలంటే భారత పౌరుడితో పోలిస్తే ఒక అమెరికన్ ఆరేడు రెట్లు వెచ్చించాలి. భారత్‌లో ఒక పూట భోజనం చేయడానికి రూ. 80 సరిపోతుంది. అమెరికాలో అదే భోజనం చేయాలంటే 10 డాలర్లు (రూ. 860) ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత్‌లో పూట భోజనానికి రూ. 80 కొనుగోలు స్థాయిని, అమెరికాలోని రూ. 860 కొనుగోలు స్థాయికి సమానం అన్నట్టు పరిగణించాలి.
ఇదే పీపీపీ భావన. అమెరికన్ డాలర్‌కు భారత కరెన్సీ మారకం విలువ రూ. 86గా ఉన్నది. అయితే, అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాల ప్రకారం.. పీపీపీ ఆధారంగా అంతర్జాతీయ డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ విలువను ప్రస్తుతం రూ. 21.61గా నిర్ణయించారు. అంటే మన 21.61 రూపాయలు.. ఒక పీపీపీ డాలర్‌కు సమానమని గ్రహించాలి. ఈ పీపీపీ డాలర్ రేట్లను ఆధారంగా చేసుకొనే వివిధ దేశాల్లో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ రేట్లను నిపుణులు గణించారు. ఈ క్రమంలో గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా టాప్‌లో ఉండగా, పెట్రోల్, డీజిల్ రేట్లలో వరుసగా 3, 8వ స్థానంలో ఉన్నది.