హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండో రోజూ వినాయక నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూకట్టాయి. మధ్యాహ్నం వరకు గణేశ్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉన్నది. నగరం నలుమూలల నుంచి నిమజ్జనం కోసం వచ్చిన గణపతి విగ్రహాలు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో బారులు తీరాయి.
దీంతో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. నగరంలో ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పారు. రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్‌లోకి లారీలకు ప్రవేశం లేదని వెల్లడించారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపు దారిమళ్లిస్తున్నారు. విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్, ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. సహాయం కోసం 040-27852482, 8712660600, 9010203626 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.