హైదరాబాద్: నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. అందువల్ల దీనిని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఆదివారం రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12.22 గంటల వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. రెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడుతుంది. గ్రహణం సమయంలో 82 నిమిషాలపాటు పూర్తిగా భూమీ నీడలోనే చంద్రుడు ఉంటాడు.
ప్రపంచంలోని దాదాపు 85 శాతం మందికి ఈ చంద్రగ్రహనం కనిపిస్తుంది. భారత్, చైనా సహా ఆసియా దేశాల్లో, ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతాల్లో, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్ర గ్రహణం, యూరోప్, ఆఫ్రికా దేశాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది. అమెరికాలో ఇది కొంచెం కూడా కనిపించదు.
కాగా, సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse) నేపథ్యంలో యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, వరంగల్ భద్రకాళీ ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి తిరుమల శ్రీవారి ఆలయాలు సహాలు పలు క్షేత్రాలు మూతపడనున్నాయి.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటల లోపు నిత్య కైంకర్యాలు, నివేదన నిర్వహించి ద్వార బంధనం చేస్తారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉదయం 7, 10 గంటలకు రెండు దఫాలుగా శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, పర్ణశాల రామాలయం తలుపులను మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేస్తారు. మళ్లీ సోమవారం (ఈనెల 8న) ఉదయం 7.30 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. వరంగల్ భద్రకాళి ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేస్తారు. తిరిగి సోమవారం ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తారు. ఇక ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతోపాటు పెంబట్లలోని దుబ్బ రాజేశ్వర స్వామి, బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను మధ్యాహ్నం ఒంటి గంటకు బంద్ చేస్తారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాలను తెరచి సంప్రోక్షణ, గ్రహణశాంతి హోమం, అభిషేకం అనంతరం ఉదయం 9.30 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు.
రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని ఉదయం 11.30 గంటలకు మూసివేయనున్నారు. సోమవారం ఉదయం 3.45 గంటలకు సంప్రోణ అనంతరం ఆలయాన్ని తెరచి, ప్రాతఃకాల పూజ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా ఏపీలోని తిరుమల శ్రీవారం ఆలయం కూడా మూతపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీనివాసుని ఆలయాన్ని వేసివేసి, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరువనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.