హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కారం కోసం సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆలోచించి, భవిష్యత్తును అంచనా వేసి ఒక పథకానికి రూపకల్పన చేసి, అమలు చేసినప్పుడే అది విజయవంతం అవుతుంది. సామాజికంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ‘కేసీఆర్ కిట్’. మాతాశిశు సంరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చిందని తాజాగా మరోసారి నిరూపితమైంది. 2023లో తెలంగాణలో శిశుమరణాల రేటు భారీగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2023’ (ఎస్ఆర్ఎస్) నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2023లో రాష్ట్రంలో శిశుమరణాల రేటు (ఐఎంఆర్) 18గా నమోదైంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో శిశు మరణాల రేటు 39గా పదేండ్లలోనే సగానికి పైగా తగ్గిందన్నమాట.
ఇదే సమయంలో జాతీయ సగటు ఐఎంఆర్ 25గా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. అంటే దేశంలో నమోదయ్యే ప్రతి వెయ్యి శిశు జననాల్లో 25 మంది మరణిస్తున్నారన్నమాట. దేశంలో అత్యధిక శిశు మరణాల రేటు నమోదవుతున్న రాష్ర్టాలుగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి. 2023లో ప్రతి వె య్యి జననాలకు 37 మంది శిశువులు మరణించినట్టు నివేదిక స్పష్టంచేసింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఐఎంఆర్ 20గా నమోదైంది. అంటే తెలంగాణ కన్నా ఎక్కువే.
కేసీఆర్ కిట్‌తో రక్షణ
శిశువులను రక్షించడం అంటే తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందుకే శిశు మరణాలను తగ్గించేందుకు తీవ్ర కసరత్తు చేశారు. కమిటీలు, నివేదికలు, చర్చోపచర్చల అనంతరం కేసీఆర్ కిట్ అనే పథకానికి రూపకల్పన చేశారు. నిరుపేద గర్భిణులను ఆదుకునే మానవీయ కోణంతోపాటు సామాజిక మార్పు, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించడం లక్ష్యాలుగా ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని అమలు చేశారు. 2017 జూన్ 2న ప్రారంభమైన ఈ పథకం మాతాశిశు సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది.
ఈ పథకం కింద గర్భిణులకు గరిష్ఠంగా రూ.15 వేల సాయం అందించారు. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13వేల నగదు చొప్పున అందజేశారు. దీంతోపాటు రూ.2 వేల విలువైన కిట్‌ను అందజేశారు. ఈ కిట్‌లో బాలింతకు, నవజాత శిశువుకు ఉపయోగపడే 14 రకాల వస్తువులను పొందుపరిచారు. దోమతెర, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, రెండు టవళ్లు, బేబీఈ న్యాప్కిన్స్, 2 జతల దుస్తులు, సోప్‌బాక్స్, ఆటవస్తువులు, తల్లి కోసం రెండు చీరలు, రెండు సబ్బులు, కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్ వంటివి కిట్ రూపంలో అందజేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు 13.90 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకోసం దాదాపు రూ.1,262 కోట్లను ఖర్చు చేశారు.
న్యూట్రిషన్ కిట్‌తో బలం
గర్భిణులకు కేసీఆర్ కిట్ అందజేసినా కొన్ని జిల్లాల్లో మాతా శిశుమరణాల రేటు అనుకున్న స్థాయిలో నియంత్రణ కాలేదు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం మరోసారి లోతుగా అధ్యయనం చేయించగా, కొన్ని జిల్లాల్లో గర్భిణులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న ఆరోగ్యలక్ష్మి పోషకాహార పథకం సరిపోవడం లేదని తెలుసుకున్నారు. దీంతో గర్భిణులకు అదనపు పోషకాహారం అందించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకానికి రూపకల్పన చేశారు.
2022 డిసెంబర్ 21 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. ముందుగా అత్యధికంగా ఎనీమియా (రక్తహీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రారంభించారు.
ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లను అందించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం, రక్తహీనతను తగ్గించడం ఈ కిట్ల లక్ష్యం. ఒక్కో న్యూట్రిషన్ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ ఒక కిలో, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, అరకిలో నెయ్యి, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు, కప్పు, ప్లాస్టిక్ బాటిల్‌ను అందజేశారు. ఒక్కో గర్భిణికి రెండు చొప్పున కిట్లను సరఫరా చేశారు. ఈ పథకం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. మహిళలను రక్తహీనత నుంచి బయటపడేసింది.
రేవంత్ సర్కారు నిర్లక్ష్యం
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కేసీఆర్ కిట్‌ను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ అనే పేరుతో అమలు చేస్తున్నది. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని ఆపేసింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ కక్షతో నిరుపేదల పొట్టకొడతారా? అంటూ ప్రజలు మండిపడ్డారు.
దీంతో కేసీఆర్ కిట్‌ను మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఎంసీహెచ్) కిట్‌గా పేరు మార్చి అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది. కిట్ల సరఫరాతో పాటు ప్రభుత్వ దవాఖానలో ప్రసవం జరిగితే ఇచ్చే ఆర్థికసాయం కోసం ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సామాజిక విప్లవానికి నాంది పలికిన పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేసీఆర్ కిట్ అమలు తీరు
లబ్ధిదారులు: 13,90,636
చేసిన ఖర్చు: 1,262 కోట్లు
ఫలితం: 2014లో ఐఎంఆర్ 39 కాగా, 2023 నాటికి 18కి తగ్గింది.