ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారి గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించుకునేవారు ప్రజానాయకులు అవుతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీవిని ఎరుగని అభివృద్ధి చేసి శాశ్వతంగా కరవు నుండి విముక్తి చేసి అభివృద్ధిలో యాభై ఏండ్లు ముందుకు తీసుకెళ్లారు కేసీఆర్. గజ్వేల్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజానీకం తమ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. శనివారం గజ్వేల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి అల్లరి మూకలను వెంటబెట్టుకొని అక్రమంగా చొరబడి కాంగ్రెస్ నాయకులు చేసిన అప్రజాస్వామిక చర్యను ఇక్కడి ప్రజానీకంతో పాటు యావత్తు తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించింది. ఇదే క్రమంలో గజ్వేల్ బంద్‌కు పిలుపునివ్వగా పట్టణంలోని వ్యాపార వర్గాలన్నీ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి కాంగ్రెస్ నాయకుల దురాగతానికి నిరసన తెలిపారు.
నియోజకవర్గ చరిత్రలో కేసీఆర్ రాకముందు, వచ్చిన తర్వాత ఎవరూ ఊహించనంత మార్పు కనిపిస్తది. తాగునీళ్ల కోసమే తండ్లాడిన ఈ కరువు నేలను కల్పతరువులాంటి కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు కట్టి అన్నపూర్ణగా మార్చిండు కేసీఆర్. గ్రామ గ్రామాన అందమైన రోడ్లు, అద్భుతమైన భవనాలను నిర్మించి పల్లెల రూపురేఖలు మార్చిండు. దశాబ్దాల కల అయిన గజ్వేల్‌కు రైలు తెచ్చిండు. జిల్లా ఆసుపత్రి కట్టిండు. అదీ చాలదని మరో వంద పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని కట్టిండు. మహతి ఆడిటోరియం, సమీకృత కార్యాలయం ఇలా ఎన్నింటినో నిర్మించిండు. పోస్టుకార్డు వేసినా, పార్సిల్ పంపినా గజ్వేల్ అని రాస్తే గద్వాలకు పోయిన రోజుల నుంచి ప్రపంచ చిత్రపటంలోనే అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. గజ్వేల్ ప్రజల ఆస్తుల విలువలతో పాటు ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పెంచితే ఈ రెండున్నరేండ్ల్ల కాంగ్రెస్ పాలనలో గజ్వేల్ పదేండ్లు వెనక్కి వెళ్లింది. కేసీఆర్ వేసిన రోడ్లకు గుంతలు పడితే పూడ్చలేని, కట్టిన బిల్డింగులకు సున్నం వేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది.
ఆ అసమర్ధత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అప్పుడప్పుడు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తూ రాజకీయ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో కనిపించని కక్షలు, కార్పణ్యాలు, వసూళ్లు, కేసులు ఈ రెండున్నరేండ్ల్లలో మితిమీరిపోయాయి. అందిన కాడికి దండుకోవడం, అడిగితే కేసులతో వేధించడం పరిపాటిగా మారింది. అందుకే రాజకీయ చైతన్యం కలిగిన ఇక్కడి ప్రజానీకం కాంగ్రెస్‌ను ఎప్పుడూ అంచుకైనా రానివ్వడం లేదు. గత మూడు పర్యాయలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి మూడుసార్లు 35 వేల ఓట్లు దాటకుండా మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించడమే కాకుండా నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీల్లో కూడా గులాబీ జెండాను ఎగురవేసి ఎన్నిక ఏదైనా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ప్రజల్లో పలుకుబడి లేని కాంగ్రెస్ నాయకులు కేవలం వారి రాజకీయ ఉనికి కోసం, మీడియాలో స్థానం కోసం మాత్రమే ఈ చిల్లర వేషాలు వేస్తున్నారని ప్రజలకు తెలుసు. ప్రజల హృదయాల్లో కేసీఆర్ వేసిన చెరగని ముద్రను పిచ్చిచేష్టలతో చెరిపివేయలేరనే సత్యాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది, లేకుంటే ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ నాయకులకు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం.
– మాదాసు శ్రీనివాస్