IAS Officers | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలే కాదు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ పెద్దల అడ్డదిడ్డమైన విధానాలు, కక్ష సాధింపులు, పదేపదే బదిలీలతో విసిగిపోతున్నారు. ఈ సర్కార్‌తో వేగలేమంటూ, ఇక్కడ పనిచేయలేమని తెగేసి చెప్తున్నారు. రాష్ట్ర సర్వీసును వదిలి కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత రెండున్నరేండ్లలో ఇప్పటికే పలువురు అధికారులు ఢిల్లీ బాట పట్టగా, తాజాగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్‌కుమార్ సైతం కేంద్ర సర్వీస్‌లోకి వెళ్తున్నారు. ఈ మేరకు ఆయనకు ఎన్వోసీ కూడా జారీఅయింది. వరుసగా సివిల్ సర్వెంట్లు రాష్ర్టాన్ని వీడుతుండటం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
మరోవైపు కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులు రాష్ర్టానికి వచ్చేందుకూ ఇష్టపడటం లేదని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకరి తర్వాత ఒకరు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లడమే తప్ప.. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేవారు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నత పదవుల్లో అవకాశం లభించినా వచ్చేందుకు ఆసక్తి చూపడమే లేదని చెప్తున్నారు. ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే ఆప్టే తెలంగాణకు వచ్చేందుకు నిరాకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి ఆయన పేరు ప్రస్తుతం డీజీపీ రేసులో ఉన్నది. తన డిపార్ట్మెంట్లోని అత్యున్నత హోదాలో పనిచేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. అ లాంటి అరుదైన అవకాశం వచ్చినా ఆ ప్టే తెలంగాణకు రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ప్రజలపై, అటు అధికారులపై వేధింపులనే అస్త్రంగా మలుచుకొన్నదనే విమర్శలున్నాయి. ప్రభు త్వ అరాచకాలను వ్యతిరేకించే రైతులు, విద్యార్థి సం ఘాల నేతలు, రాజకీయ నాయకుల వంటివారిపై కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం, ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులపైనా రాజకీయ కక్షకు పాల్పడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రిజ్వీ ఉన్నపళంగా తన పదవికి రాజీనామా చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ ఘటన అప్ప ట్లో తెలంగాణ రాజకీయ, అధికార వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకించినందుకు ఆయనపై ఓ మంత్రి కక్ష గట్టారని, అందుకే ఆయన ఐఏఎస్ పదవిని కూడా లెక్కచేయకుండా రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది.
మరో సీనియర్ అధికారి అరవింద్‌కుమార్‌పై కేసులు నమో దు చేయడమే కాకుండా ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. మరో ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్పైనా కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కారణంతో సీనియర్ అధికారి స్మితా సబర్వాల్‌ను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సివిల్ సర్వెంట్లతో సరిగా పని చేయించుకోవాల్సింది పోయి, వారిపై కేసులు పెడుతూ, వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల పాలన అన్నిరంగాల్లో విఫలమైందనే విమర్శలున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొన్నదనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ నెపా న్ని అధికారులపైకి నెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సమీక్షల్లో ముఖ్యనేత ఐఏఎస్‌లను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు. ఆయా శాఖల కార్యదర్శులు మొదలు కలెక్టర్ల వరకు ఎవరూ సరిగా పనిచేయడంలేదనే విధంగా ఆయన ముద్రవేయడంపై ఐఏఎస్‌లు తీవ్ర అసహనానికి గురవుతున్నట్టు తెలిసింది.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఏఐఎస్ అధికారులపై రుద్దడంపై మండిపడుతున్నారు. పదే పదే బదిలీలపైనా అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఒక స్థానంలో కూర్చొని, పరిస్థితులను అవగాహన చేసుకునేలోపే బదిలీ ఉత్తర్వులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. గడిచిన 27 నెలల్లో కనీసం 15 సార్లు ఐఏఎస్‌లను బదిలీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సర్దుకునేలోపే బదిలీ చేస్తే పాలనపై ఎలా దృష్టి పెడుతామని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు? ఎవరిని? ఎక్కడికి బదిలీ చేస్తారో? తెలియని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. ఈ పరిణామాలతో సివిల్ సర్వెంట్లు విసిగిపోతున్నారు. తామేమైనా తోలుబొమ్మలమా? అంటూ అంతర్గత చర్చల్లో అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ పనిచేసే వాతావరణం లేదని, రాష్ట్రం విడిచి వెళ్లిపోవడమే ఉత్తమమని కొందరు అధికారులు చెప్తుండగా, మరికొందరు విధిలేక చేతులు కట్టేసుకొని పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది.