హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) చేపట్టిన ‘మూసీ పోరుబాట’ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అవినీతికి పాల్పడే కుట్రలను విద్యార్థి నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మూసీ బాధితులకు బాసటగా నిలుస్తూ, భరోసా కల్పిస్తూ వారు ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో 50 బృందాలు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి సుందరీకరణ పేరిట కాంగ్రెస్ భూదోపిడీని ప్రజలకు వివరిస్తున్నాయి.
వివిధ రూపాల్లో బాధితులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కడారి స్వామి, పడాల సతీశ్, కే విజయరావు ఆధ్వర్యంలో మూసీ పరీవాహక కాలనీల్లో పర్యటించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదలను రోడ్డున పడేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలను వివరించారు. పలు కాలనీల్లో డప్పు దరువులు, ఆటాపాటలతో విద్యార్థి విభాగం నేత లు బాధితులకు అవగాహన కల్పించారు. ఆ యా కాలనీల్లో మూసీ పేరిట కాంగ్రెస్ చేసే అవినీతిని వాల్‌పోస్టర్లు, డోర్ పోస్టర్ల రూ పంలో ప్రజలకు చేరవేశారు. బాధిత, మహిళలు, యువతకు ప్రభుత్వ అరాచక పాలనను కండ్లకు కట్టినట్టు వివరించారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల నుంచి నాగోల్ పరిసర ప్రాంతాల దాకా మూసీ పరీవాహకంలోని బాధితుల ఇంటింటికీ తిరిగి భరోసా కల్పిస్తున్నారు. బాధిత బస్తీలు, కాలనీల ప్రజలంతా ఏకమైతేనే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని పిలుపునిచ్చారు.