గోవిందరావుపేట, ఏప్రిల్ 6: ములుగు జి ల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవ రం సరస్సు కింద రెం డో పంటకు శ్రీరాంపతి, కోట, రంగాపూర్ కాల్వల కింద తైబందీ ప్రకటించారు. ప్రస్తుతం కోట, శ్రీరాంపతి కాల్వల్లో పిచ్చి మొక్కలు పెరిగి వందల ఎకరాల్లోని చివరి ఆయకట్టుకు సాగు నీరందక నానా
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐబీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి.
దీంతో శ్రీరాంపతి, కోట కాల్వల ఆయకట్టు రైతులు ఒక్కో ఎకరానికి రూ. 800 నుంచి రూ. 1,000 వరకు జమ చేసుకొని జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఐబీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, లక్నవరం కింద యాసంగిలో జరుగుతున్న అక్రమ సాగును అరికట్టడంలో ఐబీ అధికారులు విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు.
దీనివల్ల చివరి ఆయకట్టుకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేసే క్రమంలోనే చర్యలు తీసుకోవాల్సిన ఐబీ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీ లు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా వానకాలం సాగుకు ప్రభుత్వం ముందస్తుగానే నిధులు మంజూరు చేసి కాల్వలకు మరమ్మతు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.