Harish Rao | రంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కోహెడలో కేటాయించిన 200 ఎకరాల భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.3,000 కోట్లు ఉన్నదని, దాన్ని ఎలాగైనా కాజేసేందుకు ముఖ్యమంత్రి, ఆయన ఆనుయాయులు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రంగారెడ్డి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కోహెడలో నిర్వహించిన పండ్ల మార్కెట్ పరిరక్షణ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళారుల దందాకోసం కోహెడ పండ్ల మార్కెట్ భూములను అమ్మేసేందుకు సీఎం సిద్ధమయ్యారని చెప్పారు. రైతుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోహెడ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్, పూలు, చేపల మార్కెట్ ఏర్పాటుకు 200 ఎకరాలు కేటాయించిందని గుర్తుచేశారు.
ఈ భూమిని టీజీఐఐసీకి బదలాయించి కోర్టు వివాదంలో ఉన్న దిల్ భూములను మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కమీషన్ల కోసం ముఖ్యమంత్రి వేలాది మంది రైతుల భూమిని టీజీఐఐసీకి అప్పగించి తద్వారా ఆయన అనుయాయులకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే కోహెడలో పండ్ల మార్కెట్ పనులు ప్రారంభించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. లక్షలాది మంది రైతుల కోసం ముఖ్యమంత్రి ఆలోచించకుండా నలుగురైదుగురు దళారుల కోసం తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌తో గతంలో ఎదురైన ట్రాఫిక్, పొల్యూషన్ వంటి సమస్యల నుంచి పరిష్కారం కోసం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కోహెడలో 200 ఎకరాల్లో మార్కెట్ నిర్మించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
తానుకూడా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నందున మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనతో కొట్లాడి రూ.10 కోట్లు పండ్ల మార్కెట్ కోసం తీసుకొచ్చారని గుర్తుచేశారు. భూసేకరణ సమయంలో రైతులకు రూ.17 కోట్ల పరిహారం ఇచ్చామని తెలిపారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్లను బీఆర్ఎస్ సర్కార్ కేటాయించిందని, 2020లో జీవో 11 ద్వారా ఈ మార్కెట్‌ను నోటిఫై కూడా చేశామని, జీవో 2016 ప్రకారం రూ.350 కోట్లు బ్యాంకులో జమ చేశామని చెప్పారు. ఈ స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాశ్వత పండ్ల మార్కెట్, కోల్డ్ స్టోరేజీ, పూలు, చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.వెయ్యికోట్ల అంచనాలతో డీపీఆర్ తయారు చేశామని తెలిపారు. నిధులు, భూమి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్ నిర్మాణాన్ని పక్కనబెట్టి ఈ భూమిని అమ్మాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతులు ముఖ్యమా.. వ్యాపారులా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల ప్రయోజనాల కంటే మధ్య దళారులు, వ్యాపారుల ప్రయోజనాలే ముఖ్యమని హరీశ్ విమర్శించారు. వివాదాల్లో ఉన్న భూములను మార్కెట్‌కు ఎలా కేటాయిస్తారని? ఈ భూములు ఇతరులకు కేటాయించవద్దని హైకోర్టు ఆదేశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కోర్టును ఆశ్రయించిందని, మరోవైపు భూముల్లో ఎస్సీ రైతులు కూడా ఉన్నారని, ఇన్ని వివాదాలు ఉన్న భూమిని మార్కెట్‌కు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. రేవంత్ సర్కార్‌కు ఇక్కడ మార్కెట్ కట్టే ఆలోచనే లేదని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని, కబ్జాలకు కాదేదీ అనర్హం అన్నట్టు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ భూములను కాజేసేందుకు పెద్ద ఎత్తున స్కెచ్ వేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిందని చెప్పారు. నిషేధిత జాబితాలో రైతుల భూములు చేర్చి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, కమీషన్లు ఇస్తేనే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారని తెలిపారు. వెంటనే వ్యవసాయశాఖ మంత్రి జోక్యం చేసుకొని సీఎంను ఒప్పించి కోహెడలోనే పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
భూముల చుట్టూ రేవంత్ : సబిత
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు భూముల చుట్టూ రేవంత్‌రెడ్డి తిరుగుతున్నాడని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములతో పాటు మార్కెట్‌కు చెందిన విలువైన స్థలాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి ఇక్కడ పండ్ల మార్కెట్ నిర్మించే ఉదేశం లేదని, ఎక్కడ భూమి ఉన్నా వ్యాపార కోణంలోనే ఆలోచిస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడం లేదని విమర్శించారు. ఒక రంగారెడ్డి జిల్లాలోనే నాదర్గుల్లో రూ.7వేల కోట్లు, కోహెడలో రూ.3 వేల కోట్ల విలువచేసే భూములను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, ప్రశాంత్‌కుమార్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
నాదర్గుల్ భూములు సర్కార్వే
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని 373 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ భూములేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాదర్గుల్ భూములను ప్రభుత్వ అండదండలతో కాజేసేందుకు రోజుకో కంపెనీ తెరమీదికి వస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన కొడుకును అడ్డుపెట్టి ఈ భూమిని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని రంగారెడ్డి కలెక్టర్, కందుకూరు ఆర్డీవో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారని, అయినా ఈ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, అడ్డుకుంటున్న రైతులను విచక్షణా రహితంగా కిరాయి మూకలు కొడుతున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని వాపోయారు. మరోవైపు పోలీసులు కూడా రైతులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఈ భూమిని కాజేసే ప్రయత్నంలో అనేకమంది ప్రభుత్వ పెద్దలు తెరమీదికి వస్తున్నారని తెలిపారు. నాదర్గుల్ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని, కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నాదర్గుల్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 200 ఎకరాలు సేకరించి, మార్కెటింగ్ శాఖకు అప్పగించింది. రైతులకు రూ.17 కోట్ల పరిహారం కూడా ఇచ్చింది. మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మార్కెట్ నిర్మాణం చేపట్టకపోగా భూములను టీజీఐఐసీకి అప్పగించడం వెనుక ఆంతర్యమేంటి? మార్కెట్ భూములను దొడ్డిదారిలో కాజేసేందుకు టీజీఐఐసీకి అప్పగించి వివాదంలో ఉన్న భూములను మార్కెట్ నిర్మాణం కోసం ఎట్ల కేటాయిస్తరు?
-హరీశ్‌రావు