నిజాంసాగర్, జనవరి 4: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ పటేల్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఇదే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉన్నందునే, సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఏ మేరకు ఓటు శాతం వచ్చిందో తెలిసిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్లే బాగుపడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బన్సీ పటేల్, నాయకులు కృష్ణపటెల్, నర్సింహాలు గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.