పినపాక, జనవరి 4: మండలంలోని ఏడూళ్లబయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానం 69వ జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలకు వేదికకానుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 5 రోజులపాటు కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, నవోదయ విద్యాలయాలు, సీబీఎస్ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, విద్యా భారతి వంటి విద్యాసంస్థలతోపాటు మొత్తం 33 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి.
ఇప్పటికే ఆయా జట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఎస్జీఎఫ్ అధికారులు తెలిపారు. తెలంగాణ జట్టు ఏడూళ్ళబయ్యారం చేరుకుని క్రీడా మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నది. గత 10రోజుల నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, స్థానిక అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది పోటీలు జరిగే క్రీడా మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. సింగరేణి కాలరీస్, బీటీపీఎస్ పరిశ్రమల సహకారం తీసుకుని కబడ్డీ పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేస్తున్నారు. గత నవంబర్ నెలలో రాష్ట్రస్థాయి అండర్-17 పోటీలు ఇదే పాఠశాల ఆవరణంలో దిగ్విజయంగా జరిగాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులకు సౌకర్యం కలగకుండా మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. 5వ తేదీ నుంచే క్రీడాకారులు ఈబయ్యారం చేరుకుంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. పోటీలకు రానున్న క్రీడాకారులను తరలించేందుకు మణుగూరు నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. మౌరి టెక్ సంస్థ, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వభారత్రెడ్డి భోజన వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు. కబడ్డీ పోటీల విజయవంతానికి మండల వాసులంతా కృషిచేయాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి నరేష్కుమార్ కోరారు.