తెలుగు భాషా, సాహిత్యాలకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారి చాల్జ్ ఫిలిప్ (సీపీ) బ్రౌన్ (1798-1884) చేసిన సేవల గురించి మనకు తెలుసు. బ్రిటిష్ తల్లిదండ్రులకు కలకత్తాలో పుట్టిన బ్రౌన్ రాసిన ఇంగ్లిష్-తెలుగు డిక్షనరీని ఎప్పుడో ఒకప్పుడు చూసే అవకాశం ఉంది. అయితే, ఆయన కంటే వయసులో 22 ఏండ్లు చిన్నవాడైన తెల్లజాతి క్రైస్తవ మతబోధకుడు (ఆంగ్లికన్ చర్చ్ మిషనరీ) జార్జి అగ్లో పోప్ (1820-1908) తమిళ భాషా సాహిత్యాలకూ అంతే సేవ చేశాడని ఇటీవల తెలిసింది. ఓటీటీలో ‘ఆణ్ పావమ్ పొల్లాదదు’ అనే తమిళ తెలుగు అనువాద సినిమా చూస్తుండగా జీయూ పోప్ గురించి వినే అవకాశం వచ్చింది.
‘ఆణ్ పావమ్ పొల్లాదదు’ సినిమా కథానాయికి మాళవికా మనోజ్ ఇంట్లో గోడకు తగిలిచ్చిన మూడు పెద్ద ఫొటోల్లో మొదటిది పెరియార్ ఈవీ రామసామి నాయకర్ది. రెండో ఫొటో బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్‌ది. ఇక మూడో ఫొటోలో ఐరోపా ముఖ కవళికలున్న పోప్ది. ఈ గదిలో హీరో హీరోయిన్లు ఒక రోజు మాట్లాడుకుంటూ నిలబడుతారు. ఈ ఫొటోలు చూసి హీరో.. ‘పెరియార్, అంబేద్కర్ చిత్రాల పక్కన జీయూ పోప్ ఫొటో ఉన్నది, వారిద్దరితో ఈయనకు ఏం సంబంధం?’ అని ప్రశ్నిస్తాడు. ఈ మహానుభావుల గురించి పెద్దగా తెలియని మాళవిక ‘జీయూ పోప్ కాదు, ఆయన కార్ల్ మార్క్స్’ అని జవాబిస్తుంది. ఆమె సమాధానం తప్పు అని తెలిసినా నిశ్చితార్థం తర్వాత జరిగిన సంభాషణ కాబట్టి మూడో ఫొటోలోని ప్రముఖుడు రాజకీయ, సామాజిక తత్వవేత్త మార్క్స్ కాదని చెప్పడు. ఈ జీయూ పోప్ ఎవరని హీరో గూగుల్‌లో శోధిస్తే ఆయన కెనడాలో పుట్టి ఇండియాలో 42 ఏండ్లు జీవించిన క్రైస్తవ మత ప్రచారకుడని తెలిసింది.
వాస్తవానికి ఇంగ్లండ్‌లోని ప్లిమత్, కార్న్వెల్కు చెందిన ఆయన తల్లిండ్రులు కేథరిన్ అగ్లో, జాన్ పోప్ కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. పోప్‌కు ఆరేండ్ల వయసులో ఈ దంపతులు 1826లో బ్రిటన్‌లోని ప్లిమత్ వచ్చేశారు. ఇంగ్లండ్ నుంచి ఇండియా వచ్చిన ఆయన తమిళనాడులో ఎక్కువ సంవత్సరాలు గడిపారు. చివరలో బెంగళూరులో ఉన్నారు. ఆయన తమిళం నేర్చుకొని తిరుక్కురల్, తిరువాసగమ్, నలదియార్, మణిమేగలై సహా అనేక ప్రసిద్ధ తమిళ గ్రంథాలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
క్రైస్తవ మత బోధకుడిగా వచ్చి తమిళ పండితుడిగా ఎదిగిన పోప్ తర్వాత ఉదగ మండలంలోని (ఊటీ) తన స్కూలు కొన్నేళ్లు నడిపాడు. తర్వాత సవ్యేర్పురం సెమినారీ, బెంగళూరు బిషప్ కాటన్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చివరికి ఆయన ఇంగ్లండ్ రాజధాని లండన్ బాలియోల్ (ఆక్స్ఫర్డ్) కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. తమిళ భాషకు జీయూ పోప్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని చెన్నై సముద్ర తీరంలో ఏర్పాటుచేశారు. ఆయన స్మారక చిహ్నంపై ‘ఇక్కడ ఒక తమిళ విద్యార్థి ఉన్నాడు’ అని లిఖించాలని జీయూ పోప్ కోరుకున్నాడు. తమిళ భాష అంటే ఆయనకు అంత ఇష్టం మరి.
బ్రిటిష్‌వారి పాలనా కాలంలో తమిళ భాషా సాహిత్యాలు ఎంత గొప్పవో పోప్ తన నిరంతర పరిశోధన, కృషి ద్వారా నిరూపించాడు. పద్దెనిమిదేండ్ల వయసులో ఆయన ఇంగ్లండ్ నుంచి ఓడ లో ప్రయాణం చేసి నాటి మద్రాస్ నగరానికి చేరుకున్నాడు. కొద్ది మాసాల్లోనే తమిళం అనర్గళంగా రాయడం, మాట్లాడటం నేర్చుకున్నాడు. నాటి మద్రాసు ప్రెసిడెన్సీకి రాగానే పోప్‌కు ఆయన అనుసరించిన ఆంగ్లికన్ క్రైస్తవ మత ప్రచార సంస్థ అప్పగించిన బాధ్యత స్వీకరించాడు. తమిళ పట్టణంలో ఉండగానే ఆయన లాటిన్, హిబ్రూ, తమిళం, తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడయ్యాడు. ఇండియా నుంచి ఇంగ్లండ్ వెళ్లిపోయాక ఆక్స్ఫర్డ్ బాలియోల్ కాలేజీలో తమిళం, తెలుగు భాషలను జీయూ పోప్ బోధించాడు.
ఇంతకూ పైన చెప్పిన సినిమాలో భార్యాభర్తలైన హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నాక గొడవపడి విడాకులు తీసుకునేదాకా వెళ్తారు. అప్పుడు ఒక రోజు ‘పెళ్లికి ముందు నువ్వు జీయూ పోప్ చిత్రాన్ని కారల్ మార్క్స్ అని చెప్పినా నేను భరించాను, నీ మీద ప్రేమతో’ అని కథానాయకుడు రియో రాజ్ ఎత్తిపొడుస్తాడు. మొత్తానికి తమిళులకు కూడా సీపీ బ్రౌన్ మాదిరిగా ఒక పాశ్చాత్యుడు ఒకరున్నారని ఇన్నాళ్లకు ఈ సినిమా పుణ్యమాని తెలవడం చాలా బాగుంది. భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్‌వారిలో సీపీ బ్రౌన్, జీయూ పోప్ వంటి గొప్ప వ్యక్తుల కృషి ఫలితంగా తెలుగు, తమిళ భాషలకు ఎనలేని మేలు జరిగింది.
– నాంచారయ్య మెరుగుమాల