రంగారెడ్డి, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో రంగారెడ్డిజిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. జీడీఏ పెంపొందించుకోవడంలో దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. రంగారెడ్డి జిల్లా ఎదుగుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. గ్రేటర్ హైదరాబాద్ పేరుతో జిల్లాలోని ముఖ్యమైన శంషాబాద్, ఆదిబట్ల, తుక్కుగూడ, పెద్దఅంబర్‌పేట్, తుర్కయంజాల్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్ వంటి ప్రాంతాలను హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనం చేశారు.
దీంతో రంగారెడ్డిజిల్లా 22 గ్రామీణ మండలాలకు మాత్రమే పరిమితమైంది. ఈ పరిస్థితిలో రంగారెడ్డి జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం మరో ప్రయత్నానికి తెరలేపింది. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాతో పాటు మరికొంత ప్రాంతాన్ని రంగారెడ్డి అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ కమిషనర్రేట్ పరిధిలో ఉన్న 22 మండలాలను మరో జిల్లాగా విస్తరించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాతో ఆటలాడుకుంటూ ముక్కలుముక్కలు చేస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు నోరు మెదపకపోవడంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా పరిధిలోని ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న అనేక ఐటీ కంపెనీలున్న ప్రాంతాలు హైదరాబాద్ నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి. చివరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్న ప్రాంతం కూడా హైదరాబాద్ మహానగరం పరిధిలోకి వెళ్లిపోయింది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ నియోజకవర్గాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్ మండలాలు మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం, కందుకూరు మాత్రమే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. హయత్‌నగర్, సరూర్‌నగర్, బాలాపూర్ వంటి ప్రాంతాలన్నీ గ్రేటర్ పరిధిలోకి వెళ్లిపోయాయి. కేవలం రంగారెడ్డి జిల్లా పరిధిలో గ్రామీణ మండలాలు మాత్రమే ఉన్నాయి.
రంగారెడ్డిజిల్లా విభజనపై ఆ పార్టీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం తన ధిక్కార స్వరాన్ని పెంచారు. అసెంబ్లీ సాక్షిగానే జిల్లాలోని మున్సిపాలిటీలను అడ్డగోలుగా గ్రేటర్లో విలీనం చేయడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిళ్లను ఇష్టానుసారంగా అధికారులు మార్చుకుంటూ పోతున్నారన్నారు. జిల్లాలోని అనేక మున్సిపాలిటీలను హైదరాబాద్ నగరపాలక సంస్థలో కలపడంతో పాటు జిల్లాను మరోసారి విభజిస్తామనే ఆలోచనను కూడా విరమించుకోవాలని ఆయన ప్రభుత్వానికి చురకలంటించారు.
రంగారెడ్డిజిల్లా 1978లో ఏర్పడింది. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సమీప బంధువైన కొండా వెంకట్‌రంగారెడ్డి పేరుపై రంగారెడ్డిజిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదగడంతోపాటు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో కూడా రంగారెడ్డిజిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. అలాంటి జిల్లాను ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు అడ్డగోలుగా ముక్కలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడంలేదు. జిల్లా ఉనికికి ప్రమాదమని తెలిసినప్పటికి కూడా ఆ పార్టీ నేతలెవరూ ప్రశ్నించడంలేదు.