జయశంకర్ భూపాలపల్లి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : కిషన్రెడ్డీ.. నీకు దమ్ముందా? ఉంటే బొగ్గుగనులన్నింటినీ సింగరేణికే కేటాయించి భరోసా యాత్ర చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ యాత్ర చేస్తున్నావు? అది కాంగ్రెస్‌కు బతుకునిచ్చే యాత్ర అని మండిపడ్డారు. ఏడేండ్లుగా కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఏంలాభం చేశావో చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అంధకారంలోకి నెట్టే కుట్ర చేయగా, గతంలో తమ పార్టీ ఆధ్వర్యంలో బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని అనేక ధర్నాలు, రాస్తారోకోలు చేశామన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి 100 శాతం అన్‌ఫిట్ చేయించి, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్లందరికీ ఉద్యోగాలిస్తే భరోసా ఇచ్చినట్లేనన్నారు. సింగరేణిని కేసీఆర్ దోచుకుతిన్నారనడం సిగ్గుచేటని, ఆయన కార్మికులకు 32 శాతం లాభాల వాటా ఇచ్చాడని, రామప్పకాలనీలో 2వేల క్వార్టర్స్ నిర్మించారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలని విమర్శించారు.
సింగరేణికి ప్రభుత్వం బాకీపడ్డ రూ. 54వేల కోట్లను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కన్నెపల్లి పంపులు ఆన్‌చేసి ప్రాజెక్ట్‌కు ఏమైనా జరిగితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ రాజకీయాలు చెయ్యమని సవాల్ విసిరితే.. కాంగ్రెసోళ్లు దాన్ని స్వీకరించలేదన్నారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్లను ఆన్‌చేసి నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, కౌన్సిలర్లు నరేందర్, మంజుల, పూర్ణచందర్, రాజు, నాయకులు మాడ హరీశ్‌రెడ్డి, నూనె రాజుపటేల్, మురళీధర్, దుండ్ర కుమార్, దేవేందర్, తిరుపతి, ఎం వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు దేవరకొండ మధు, కుమారస్వామి, యూత్ నాయకులు మహేందర్, దిలీప్‌కుమార్, రాకేశ్, తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి-3, కోయగూడెం-3 బ్లాక్‌లను నామినేషన్ పద్ధతిలో, శ్రావణపల్లి కేకే-6 మైన్‌ను నేరుగా సింగరేణికే కేటాయించాలి. సింగరేణి పబ్లిక్ సెక్టార్ హో దాను పునరుద్ధరించాలి. గోలేటి, మాదా రం, పూసాలపల్లి జేకే-5వ గనులకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు మంజూరు చేయించాలి. మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌ను నేరుగా సింగరేణికే కేటాయించాలి. ఇవన్నీ నెరవేరిస్తేనే కార్మికులకు అసలైన భరోసా ఇచ్చినట్లు అవుతుంది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు