ఇంట్లో కాంతి రేఖలు ఎంత అందంగా పరచుకుంటే మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. కొన్నిసార్లు పండు వెన్నెల, కొన్నిసార్లు మసక చీకటి మన మదిని మెప్పిస్తుంటాయి. అచ్చం అలాగే ఇంట్లో కాంతిని విభిన్న రకాలుగా విభజిస్తూ సరికొత్త ఇంటీరియర్ ట్రెండ్‌కు తెరతీశారు డిజైనర్లు. అదే ‘లేయర్డ్ లైటింగ్’. ఇందులో ఇంట్లో కాంతిని విభిన్న అంచెలుగా విభజిస్తారు. దాని కోసం ప్రత్యేకమైన లైట్లను వినియోగిస్తారు. ఒక్కో తరహా లైటు ఒక్కో రకం కాంతిని విరజిమ్ముతూ, ఒక్కో విభాగాన్ని మనోహరంగా ప్రతిఫలిస్తుంది. యాంబియంట్ లైటింగ్, టాస్క్ లైటింగ్, యాక్సెంట్ లైటింగ్ ఇలా ఒక్కో రకం ఒక్కో తరహాలో పనిచేస్తుంది.
యాంబియంట్ లైటింగ్ అనేది గది మొత్తానికీ వెలుతురుని ఇచ్చే ప్రాథమిక రకం. ట్యూబ్ లైట్లు, ఫాల్స్ సీలింగ్‌లో వాడే లైట్లలాంటివన్నమాట. చదవడం, వంట చేయడం వంటి ప్రత్యేక పనుల కోసం స్టడీ ల్యాంప్, కిచెన్ లైట్లలాంటివి టాస్క్ లైటింగ్ కిందకి వస్తాయి. ఇవి కళ్ల మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇంటిలోని పెయింటింగులు, అందమైన వస్తువులు, ఆర్కిటెక్చర్‌ను ఎలివేట్ చేసి చూపించేది యాక్సెంట్ లైటింగ్. ఇవి కాక గోడల నుంచి సీలింగ్ వరకూ వరుసలో ఉండే ప్రొఫైల్ లైట్లు, డైనింగ్ ఏరియాకు కొత్త లుక్ తెచ్చే డైనింగ్ టేబుల్ పెండెంట్ లైట్లలాంటి వెరైటీలూ ఉంటాయి. వీటన్నింటి కలబోతగా ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే ఈ లేయర్డ్ లైటింగ్ ప్రత్యేకత. వెలుగు నీడల కలబోతగా కాంతి రేఖలు చేసే మ్యాజిక్ ఇదన్నమాట!