టేక్మాల్, జనవరి 11: అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీల మాటలు నీటి మూటలేనని తేలిపోయాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఎకరానికి రూ.10 వేల రైతుబంధు ఇవ్వగా, తాము ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాయమాటలతో రైతులను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రూ.15వేలకు బదులు రూ.12 వేలు ఇస్తామని రైతులకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా టేక్మాల్‌లో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యం లో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించా రు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చిన కాంగ్రెస్ అమలులో విఫలమైందని అన్నారు. మాయమాటలు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇప్పటికి చాలా గ్రా మాల్లో కాలేదని చెప్పారు. పార్టీ మాటలు నమ్మి మోసపోయామని కాంగ్రెస్ కార్యకర్తలే బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ రైతుబంధు వస్తలేదని, కేసీఆర్ కిట్టు వస్తలేదని, కల్యాణలక్ష్మి తులం బంగారం వస్తలేదని అన్నారు. ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు జైపాల్‌రెడ్డి, నాగభూషణం, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి పాల్గొన్నారు.