కొల్లాపూర్ : బీఆర్ఎస్ తోనే హైదరాబాద్కు ప్రపంచ ఖ్యాతి లభించిందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం బోరబండ, మధురానగర్ ఇంద్ర నగర్ కాలనీలలో ఆయన స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఆయా కాలనీలలోని ముఖ్యమైన వారిని మాజీ ఎమ్మెల్యే కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బోరబండ ఇంద్రానగర్ మధురానగర్ కాలనీలకు చెందిన బి ఆర్ ఎస్ స్థానిక నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నాయకులకు ఉప ఎన్నికలపై దిశనిర్దేశం చేశారు.
గులాబీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమైక్య పాలనలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వ నగరంగా మారిందన్నారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైదరాబాద్ మహానగరంలో విధ్వంసం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా మూలంగా మధ్య తరగతి ప్రజలు భారీగా నష్టపోయారన్నారు. సీటీ బస్సుల చార్జీలను భారీ మొత్తంలో పెంచి రోజువారి ప్రయాణాలు కొనసాగించే మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచారని మండిపడ్డారు. కాంగ్రెసు అరాచక పాలన అంతం కావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.