వనపర్తి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల అధికార యంత్రాంగం అధికారపార్టీకి కొమ్ము కాయడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సింగిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 23వ వార్డుకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నిరంజన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం అక్కడే ఉన్న మీడియాతో సింగిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని పలుచోట్ల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం అధికార పార్టీకి అండగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాల ని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల కౌంటింగ్‌లో అభ్యర్థుల కండ్ల ముందే పోలీసుల జులుంతో తప్పులు జరిగాయన్నారు. వీటి ఫలితంగా వనపర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామ పంచాయతీల ఫలితాలు తారుమారు అయ్యాయని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల అభిష్టానికి తగ్గట్లుగా నిర్భయంగా ఎన్నికల నిర్వహణ జరిగితేనే ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.