యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు హకును వినియోగించుకున్నారు. జిల్లాలో 87.1 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో బ్యాలె ట్ బాక్సులను భువనగిరిలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
102 వార్డులు.. 208 పోలింగ్ కేంద్రాలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు ము న్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించారు. 102 వార్డులకు 353మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 208 పోలిం గ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది.
పోలింగ్ సరళి ఇలా..
పోలింగ్ సరళి ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. ఆరు మున్సిపాలిటీల్లో కలిపి ఉదయం 9 గంటల వరకు 10.75 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోచంపల్లి మున్సిపాలిటీలో అతి తకువగా 7.10 శాతం నమోదైంది. 11గంటల వరకు 31.42 శాతం, ఒంటి గంట వరకు 53.28 శాతం, 3గంటల వరకు 72. 21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా జిల్లాలో 87.1 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చౌటుప్పల్‌లో 91.91శాతం, అతి తకువగా భువనగిరిలో 82.93 శాతం పోలింగ్ నమోదైంది. పోచంపల్లిలో 90.95శాతం, గుట్టలో 89.86 శాతం, మోతూర్లో 86.92శాతం, ఆలేరులో 85.81 శాతం ఓట్లు పోలయ్యాయి.
చౌటుప్పల్‌లో ఓటర్లకు పండగే..
చౌటుప్పల్‌లోని 19వ వార్డులో అన్ని పార్టీలు కలిపి ఓటుకు రూ.25వేలు ఇచ్చారు. రెండు పార్టీలు ఓటుకు రూ. 10వేల చొప్పున, మరో పార్టీ రూ. 5వేల చొప్పున ముట్టజెప్పింది. ఆలేరు, గుట్ట, పోచంపల్లిలోని పలు వార్డుల్లో కాంగ్రెసో ళ్లు ఓటుకు రూ.10 వేలు పంచారు.