హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే మొదటి సాంకేతిక విశ్వవిద్యాలయమైన జేఎన్టీయూహెచ్ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. పీహెచ్డీ గైడ్షిప్ కోసం ఎక్కడా లేని విధంగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఓ రూ.5వేలు కడితే చాలు ప్రైవేట్ కాలేజీల్లోని ఫ్యాకల్టీకి పీహెచ్డీ గైడ్షిప్ కట్టబెడతామంటున్నది. ఇటీవలే వర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం(ఆర్ అండ్ డీ), వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వెబ్‌నోట్ విడుదల చేసింది. రీసెర్చ్‌స్కాలర్స్‌కు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశం కల్పించేందుకు ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి గల వారికి ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసే అవకాశం ఇచ్చింది. అవసరమైన డాక్యుమెంట్లు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాల్సి ఉండగా, దరఖాస్తు చేసే వారు రూ. 5వేలు ఫీజుగా చెల్లించాలని సూచించింది. వర్సిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. దేశంలో ఏ వర్సిటీ కూడా గైడ్షిప్ కోసం ఫీజులు వసూలు చేయడంలేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. డబ్బులు తీసుకుని, సూపర్వైజర్ బాధ్యతలను కేటాయించడంలేదని పేర్కొంటున్నారు. పైగా ఇది నిబంధనలకు విరుద్ధమని ఓ ప్రొఫెసర్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధి జే దిలీప్ వ్యతిరేకించారు. ఇలాంటి నిబంధన దేశంలో మరెక్కడాలేదని పేర్కొన్నారు. తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజీస్ ఉద్యోగుల సంఘం నేత అయినేని సంతోష్‌కుమార్ సైతం ఈ నోటీసును రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
వర్సిటీ పరిధిలోని పలు కాలేజీల్లో ఫేక్ ఫ్యాకల్టీ ఇంకా కొనసాగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అనర్హులతో పాఠాలు బోధిస్తున్నారనే వాదనలున్నాయి. బయోమెట్రిక్ హాజరు పెట్టినా మైనపు ముద్దలతో హాజరు నమోదుచేసిన ఉదంతాలు బయటపడ్డాయి. విద్యాప్రమాణాలు, నాణ్యమైన బోధనపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 8 మంది ఫేక్ పీహెచ్డీ సర్టిఫికెట్లు సమర్పించడంతో వర్సిటీ వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ తరుణంలో వర్సిటీ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ కాలేజీలకు ప్రయోజనం చేకూరేలా వర్సిటీ అధికారుల నిర్ణయాలున్నాయన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. పీహెచ్డీ సీట్ల దందాకు వర్సిటీ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.
జేఎన్టీయూలోని ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ కెరీర్ డెవలప్మెంట్పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతోపాటు యువ ప్రొఫెషనల్స్, స్టార్టప్‌లపై ఆసక్తి గలవారు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకుని హాజరయ్యారు. ఈ సందర్భంగా కెరీర్ అభివృద్ధి మార్గాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పునాదులు, స్టార్టప్‌ల ఆర్థిక అంశాలు, వ్యాపార ఆలోచనలను అమల్లోకి తీసుకురావడం, ఎస్ఎంఈ ఆంత్రప్రెన్యూర్లు ఎదుర్కొనే సవాళ్లు, అవకాశాలు, వారి పరిష్కారాలపై నిపుణులు విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ టీ కిషన్‌కుమార్‌రెడ్డి, రెక్టార్ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ కే వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ జీ వెంకట నరసింహారెడ్డి పాల్గొన్నారు.