హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ జోక్యమేనని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐసీడీఎస్‌లు ఉండగా సర్పంచ్‌లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడమెందుకని ప్రశ్నిస్తున్నాయి. ఈ నిర్ణయం అంగన్వాడీల నిర్వాహకులను దొంగలుగా చిత్రీకరించడమేనని మండిపడుతున్నాయి. పోషకాహారం పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకేనని ప్రభుత్వం చెప్పడం సరికాదని ఆక్షేపిస్తున్నాయి. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తున్నాయి.
అంగన్వాడీ లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాయి. ఇందుకోసం గతంలోనే సర్పంచ్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో ఏఎల్‌ఎంసీ (అంగన్వాడీ లెవల్ మానిటరింగ్ అండ్ సపోర్ట్) కమిటీలను నియమించాయి. అలాగే సెంటర్లకు ఆహారపదార్థాలు అందించేందుకు థంబ్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా సూపర్వైజ్ చేసేందుకు పోషణ్‌ట్రాకర్, ఎన్హెచ్డీఎస్ యాప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో చిన్నారులు, లబ్ధిదారుల సంఖ్య, వారికి ఇచ్చే ఆహార పరిమాణం, ఫేస్రికైగ్నెజేషన్, సెంటర్లకు చేరిన ఆహారం తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వారానికోసారి ఐసీడీఎస్ సూపర్వైజర్లు సెంటర్లను సందర్శించి వివరాలు తీసుకుంటారని, అలాగే ఎంపీడీవోల నుంచి కలెక్టర్ల వరకు తనిఖీ బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉండగా సర్పంచ్ల ఆధ్వర్యంలో కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వడం అసంబద్ధమని చెబుతున్నారు.
ఐసీడీఎస్‌ల నిర్వీర్యానికే కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని యూనియన్ల నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పూనుకున్నారని గుర్తుచేస్తున్నారు. అలాగే పీఎంశ్రీ కింద అంగన్వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నదని మండిపడుతున్నారు. క్రమంగా ఐసీడీఎస్ విధానాన్ని బలహీనపరిచి అంతిమంగా రద్దుచే సేందుకు కుతంత్రాలకు దిగుతున్నదని పేర్కొంటున్నారు.
నాడు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీలకు అనేక హామీలిచ్చిందని యూనియన్ల బాధ్యులు చెబుతున్నారు. వేతనాలు రూ. 18,000కు పెంచుతామని, ఉద్యోగభద్రత కల్పిస్తామని, టీచర్లకు రూ. 1.50 లక్షలు, ఆయాలకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని నమ్మబలికిందని గుర్తుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా అమల్లో విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఈ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
సర్పంచుల నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) యూనియన్ల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఊరుకోబోమని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పీ జయలక్ష్మి హెచ్చరించారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ కమిటీలను వేసి పిల్లల ఆహారాన్ని దొంగిలించే వ్యక్తులుగా ముద్రవేస్తున్నదని ఆవేదనవ్యక్తం చేశారు.