హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. గ్రామాలు, మండలాల వారీగా రైతులు తీసుకున్న రుణ వివరాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలనివ్వనని చెప్పిన రేవంత్.. ఇంటింటికీ తిరిగి కండువాలు కప్పుతున్నాడని అన్నారు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే బీజేపీకి ఆధిక్యం వచ్చిందని, బీజేపీని నిలువరించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని చెప్పారు. వైఎస్ హయాంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను లాకున్నారని, కానీ తెలంగాణను ఆపలేక పోయారని అన్నారు. తెలంగాణ అనేది నిరంతర జ్వా ల అని, దాని కోసం తెలంగాణ తెచ్చిన పార్టీ గా, పదేండ్లు గొప్పగా పాలించిన పార్టీగా నిరంతరం పోరాడుతామని స్పష్టంచేశారు.
నలుగురు ఎమ్మెల్యేలను లాకోవడం మూలంగా బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చగలమని అనుకుంటే పొరపాటే అవుతందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు నెలలుగా పింఛన్లు ఇవ్వడం లేదని, రైతుభరోసా ఎప్పుడిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రుణమాఫీకి సం బంధించి రూ.19 వేల కోట్లకు రూ.14 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, ఎన్నికల నాటికి మిగిలిపోయిన రైతాంగానికి రుణమాఫీ చేస్తరా..? చేయరా..? ప్రకటించాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు ఎకరాలలోపు రైతులకు రూ.2 లక్షల రుణాలు లేవని, ఈ విషయం బ్యాంకు అధికారులే చెబుతున్నారని అన్నారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని మండిపడ్డారు. మహిళలకు రూ.2500, 4వేల పింఛను, విద్యార్థులకు రూ.5 లక్షల సాయం ఏమయ్యాయని, రాష్ట్రంలోని మేధావులు ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రజనీ సాయిచంద్, బీఆర్ఎస్ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి పాల్గొన్నారు.