హైదరాబాద్ : తెలంగాణ భవన్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అశోక్ నగర్ నుంచి, వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత తరలివచ్చి ఛలో సెక్రెటేరియట్ కార్యక్రమానికి మద్దతివ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేదాకా అసెంబ్లీ లోపల, బయట బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.
విద్యార్థులకు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కృషి చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. మేం ఉద్యోగాలు ఇవ్వలేదని
రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని అన్నారు. తాము గట్టిగా ప్రశ్నిస్తేనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని చెప్పారు.
నాడు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం వెంటనే సభలో చర్చ పెట్టకుండా వాయిదా వేసుకుని పారిపోయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్లో చెప్పిన విధంగా నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఎస్పీడీసీఎల్, ఫారెస్ట్, గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ ఇలా అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో చెప్పారని ఆయన గుర్తుచేశారు. కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని, ఇది దగా క్యాలెండర్ అని మండిపడ్డారు.
మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందని హరీశ్‌రావు విమర్శించారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, 20 నెలలు కావొస్తున్నా రేవంత్ సర్కారు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని అన్నారు. రేవంత్ సర్కారు తీరు ఏరు దాటేదాక ఓడ మల్లన్న, ఏరు దాటినంక బోడి మల్లన్న అన్న తీరుగా ఉందని ఎద్దేవా చేశారు. 20 నెలల్లో రేవంత్ ఇచ్చిన ఉద్యోగాలు 12 వేలు కూడా దాటలేదన్నారు. రేవంత్ రెడ్డి యువతను దారుణంగా మోసం చేసిండని ఆరోపించారు.
తాము పదేళ్లలో ఏడాదికి సగటున 16 వేల ఉద్యోగాల చొప్పున ఇచ్చామని, రేవంత్ సర్కారు రెండేళ్లుగా మా సగటులో సగం కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ నోటిఫికేషన్లు ఇవ్వ చేతగాక అబద్దాలు మాట్లాడుతున్నడని విమర్శించారు. ప్రియాంకా గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ చేశారని, ఇందిరాగాంధీ మనవరాలుగా మాటిస్తున్నానని చెప్పారని, ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఎక్కుడున్నారని ప్రశ్నించారు.
నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రియాంకా గాంధీ ఎందుకు ప్రశ్నించడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్‌లోని ఐదు అంశాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేల పించన్, రెండు లక్షల ఉద్యోగాలు, అమ్మాయిలకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్ దిక్కు లేకుండా పోయిందన్నారు.
జీవో 29 రద్దుచేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నియామకాల్లో దగా చేశారని విమర్శించారు.
రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చుని నిరుద్యోగులకు మాట ఇచ్చారని, రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పారని హరీశ్‌రావు అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ ఇలా అందరూ నిరుద్యోగులను మోసం చేశారని, తక్షణం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయి మాట్లాడుతున్నడని, 60 వేల ఉద్యోగాలు ఎప్పుడిచ్చాడో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
బల్మూరి వెంకట్, ఆకునూరి మురళి, రియాజ్‌లు మాయ మాటలు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టారని, ఇప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదుగానీ, రెచ్చగొట్టిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగుల దగ్గరికి వెళ్తే బెదిరిస్తున్నరని, అక్రమ కేసులు పెడుతున్నరని, ప్రశ్నించిన పిల్లల మీద దాడులు చేస్తున్నరని అన్నారు. నిరుద్యోగులు భయపడవద్దని, పోరాడాలని, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుదని చెప్పారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మానుకోట నుంచి వచ్చిన శ్రీధర్‌కు ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదని చెప్పారు. రూ.3000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేస్తమన్నరని, ఒక్క రూపాయి కూడా ఇవ్వక కాలేజీలు మూతపడుతున్నాయని అన్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు మూత పడుతున్నాయని చెప్పారు. బడా కాంట్రాక్టర్లకు రూ.12 వేల కోట్లు విడుదల చేశావని, పిల్లలు కమిషన్ ఇవ్వడం లేదని రీయింబర్స్ ఇవ్వడం లేదా.. అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారని, కరోనా వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా కేసీఆర్ రీయింబర్స్ ఆపలేదని.. ఎస్సీలు, బీసీలు, మైనార్టీల పిల్లలు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్నచూపని హరీశ్‌రావు నిలదీశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, తక్షణం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని, నాలుగు వేల భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా హలో నిరుద్యోగి, చలో సెక్రెటేరియట్ పోస్టర్‌ను మాజీ మంత్రి ఆవిష్కరించారు.