బాన్సువాడ, జూలై 13: పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల మాతా శిశు దవాఖానలో రెండురోజుల వ్యవధిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. సిజేరియన్ ఆపరేషన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, వారిని నిజామాబాద్, హైదరాబాద్‌కు తరలించారు. దవాఖానలో శుక్ర, శనివారాల్లో పది మంది బాలింతలకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు.
ఇందులో ఎల్లారెడ్డికి చెందిన ఉమేర ఫాతీమా, బాన్సువాడకు చెందిన లక్ష్మీప్రియ, పిట్లం మండలం బండాపల్లికి చెందిన సునీత, గాంధారికి చెందిన జ్యోతి, బాన్సువాడ మండలంలోని కొత్తాబాదీకి చెందిన రుక్సానా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ప్లేట్ లేట్ కౌంట్స్ పడిపోవడం, రక్త స్రావం జరగడంతో హుటాహుటిన దవాఖాన సిబ్బంది నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ నెల 10న ఉమేర ఫాతీమా, లక్ష్మీప్రియ, 11న సునీత, రుక్సానా, జ్యోతికి సిజేరియన్ చేయగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వీరిలో ఉమేర ఫాతీమా, జ్యోతి , రుక్సానా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించారు. సిజేరియన్ అయిన పది మందిలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బాధిత కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై బాన్సువాడ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్‌భాస్కర్‌ను వివరణ కోరగా, పది మందికి సిజేరియన్ జరిగింది వాస్తవమేనని, అందులో ఐదుగురు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సీజేరియన్ చేసిన అపరేషన్ థియేటర్‌ను పరిశీలించామని, అందులో ఉన్న మందులను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపనున్నట్లు చెప్పారు.
వైద్య సేవలు అందించడంలో మంచిపేరు తెచ్చుకున్న బాన్సువాడ ప్రభుత్వ మాతా శిశు దవాఖానలో ఐదుగురికి వైద్యం వికటించడం వెనుక కారణాలు తెలియరావడంలేదు. సిజేరియన్ అనంతరం ప్లేట్ లేట్స్ పడిపోవడం, ఇన్ఫెక్షన్ సోకడం, రక్త స్రావం, అధిక రక్తపోటు వంటి కారణాలకు ఎవరు బాధ్యులో తేలాల్సి ఉన్నది.