హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరమని, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, జాతీయ సంస్థలు, మౌలిక వసతుల పనులకు అవసరమైన అనుమతులు, నిధుల సాధనలో అన్ని పార్టీల ఎంపీలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ అవసరాలను బలంగా వినిపించాలని సూచించారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు, మెట్రో రెండో దశ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, తమ్మిడిహట్టి ప్రాజెక్టు, తుంగభద్ర జలాల సమస్య, గోదావరి-కావేరి అనుసంధానం, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, బుల్లెట్ రైలు వంటి కీలక అంశాలపై కేంద్ర అనుమతులు, నిర్ణయాలు అవసరమని సీఎం వివరించారు. ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ ప్రతిపాదనలకు ఆమోదం తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. ఎంపీలకు అవసరమైన సమాచారం, అధికారిక పత్రాలు, తాజా వివరాలను అందించేందుకు ఢిల్లీలోపి తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
భేషజాల్లేవు : భట్టి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ భేషజాలు లేవని స్పష్టంచేశారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో కలిసి పనిచేస్తూ తెలంగాణకు రావాల్సిన నిధులు, సంస్థలు, ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యమని చెప్పారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, స్టాండింగ్ కమిటీలు, కన్సల్టేటివ్ కమిటీలను సమర్థంగా వినియోగించి రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు. అవసరమైతే ముఖ్యమంత్రి, తాను ఢిల్లీకి వెళ్లి ఎంపీలతో కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీలు కూడా పలు సూచనలు చేశారు. ధాన్యం నిల్వ సామర్థ్యం, సింగరేణికి బొగ్గు బ్లాకుల కేటాయింపు, సాగునీటి ప్రాజెక్టులు, ప్రొటోకాల్, కేంద్ర అనుమతుల వంటి అంశాలను ప్రస్తావించారు. ఎంపీలు కోరిన ప్రతి సమాచారాన్ని వేగంగా అందించాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.