హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): కేంద్రం చేపడుతున్న నదుల అనుసంధాన ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా రాష్ర్టానికి 43టీఎంసీలు వచ్చే అవకాశమున్నదని, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై రాష్ట్ర ఎంపీలకు ప్రజాభవన్‌లో సోమవారం ప్రత్యేక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటుచేశారు. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలను, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాల్సిన ప్రాజెక్టులను సీఎం వివరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఓఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ, మూసీ పునరుజీవం పనులు చేపట్టేందుకు తీసుకోవాల్సిన అనుమతులపై ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని కోరారు.
ఈ విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సైతం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా అంత రాష్ట్ర నదీజలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్య మంత్రులతో చర్చించిన అంశాలను ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా పూడికతో 5టీఎంసీలకు మించి రావడం లేదని, డ్యామ్‌తో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని కేంద్రమంత్రిని కోరామని, ఆ విషయంపైనా ఎంపీలు మరోసారి కేంద్ర మంత్రిని కలువాలని సీఎం సూచించారు. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి నుంచి నీళ్లు తీసుకునే విషయంలో ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని సీఎం తెలిపారు. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు 300 టీఎంసీల వాటా ఉన్నదని, ఆ జలాలను ఛత్తీస్‌గఢ్ వాడుకోవడం లేదని, భవిష్యత్‌లో 160 టీఎంసీలు వాడుకున్నా ఇంకా 143 టీఎంసీలు మిగులు ఉంటాయని పేర్కొన్నారు. నదుల అనుసంధానం చేపడితే అందులో తెలంగాణకు 43టీఎంసీలు లభించే అవకాశముందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గోదావరి జలాలను ఏపీ మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకు తీసుకెళ్లే విధంగా గోదావరి-కావేరి అనుసంధానం ప్రణాళిక ఉన్నదని, ఆ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు.
ఇకడ నీళ్లు ఛత్తీస్గఢ్వి, నిధులు కేంద్రానివని, ఆ రెండింటినీ తెలంగాణకు అనుకూలంగా సాధించాలని ఎంపీలకు సీఎం వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు(ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉన్నదని, ఆ విషయంపైనా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రితో చర్చించామని, వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్వోసీలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని సీఎం చెప్పారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150-151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో భేటీ అవుదామని ఎంపీలతో సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, పార్టీలకతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించేందుకు ఢిల్లీ తెలంగాణ భవన్లో కో ఆర్డినేషన్ కోసం ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్‌సింగ్‌ను నియమించామని సీఎం తెలిపారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా ఆయన వద్ద తీసుకోవచ్చని, పార్టీలతో సంబంధం లేకుండా ఎంపీలు అడిగే సమాచారం వేగంగా వారికి అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని ముందుకుసాగాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సీఎం సూచించారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలకు సంబంధించి కేంద్రానికి పంపిన లేఖలు, ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ సిద్ధం చేసిన వివరాలను పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.