కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం పంపులు నడుపకుండా.. పంటలకు నీళ్లివ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతున్నదని, సహనం నశించి రైతులు తిరగబడితే రేవంత్‌రెడ్డికి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన శిఖండి నివేదికను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా అన్నదాతల ఉసురు పోసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఈ విషయంలో బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, ప్రస్తుతం సీఎం చెప్తున్న నివేదిక ఎన్డీఎస్ఏది కాదని, అది ఎన్డీయే సర్కార్ ఇచ్చిన నివేదికని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఆ శిఖండి నివేదికను పక్కన పెట్టి రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విజ్ఞప్తి మేరకు సోమవారం లోయర్ మానేరు డ్యామ్‌ను కేటీఆర్ సందర్శించారు. ఎల్ఎండీలో నీటి మట్టాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.
ఎలాంటి టెస్టులు చేయకుండా నివేదిక
కన్నెపల్లి పంపుహౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోయకుండా సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న సాకులపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలో మేడిగడ్డ బరాజ్‌లో ఒక్క పిల్లర్ దెబ్బతింటే ఎలాంటి పరీక్షలు, చివరికి సాయిల్ టెస్టు కూడా చేయకుండా ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని విమర్శించారు. కేవలం ఎన్నికల్లో బీఆర్ఎస్ను బదనాం చేయాలన్న లక్ష్యంతో ఆనాడు 48 గంటల్లోనే నివేదిక ఇచ్చిందని, తర్వాత అనేక అబద్ధాలు జోడించి తాజాగా అదే నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆ నివేదికను సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు బీజేపీ నాయకులు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని, ఆ ప్రాజెక్టు ఇప్పటికే మూడు సార్లు కొట్టుకుపోతే అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో ఎస్సెల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది కూలీలు చనిపోయినా, సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయి కోట్ల నష్టం వాటిల్లినా, పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినా, వట్టెం పంపుహౌస్ మునిగిపోయినా అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకుపోలేదని నిలదీశారు. బీహార్‌లో బ్రిడ్జిలు కూలిపోయినా, గుజరాత్లో డ్యామ్‌లు కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ పోదని, కేవలం తెలంగాణలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్, బీజేపీ అలయ్ బలయ్ చేసుకొని శిఖండి నివేదికను అడ్డం పెట్టుకొని డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు. అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదని, ఎన్డీయే సర్కార్ రిపోర్టు అని నొక్కి చెప్పారు. అర్థంలేని రిపోర్టులను అడ్డం పెట్టుకొని రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతూ ఎన్డీఎస్ఏ చెప్పేవరకు పంపులను ఆన్ చేసేది లేదని చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
తమాషా చూస్తున్న సీఎం
కాళేశ్వరం వద్ద రోజుకు తొమ్మిది టీఎంసీల నీళ్లు దిగువకు పోతున్నాయని, ఆంధ్రాలో ఆ నీటిని పైపుల ద్వారా ఎత్తిపోసుకుంటుంటే, మన ముఖ్యమంత్రి మాత్రం తమాషా చూస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మధ్యమానేరు, లోయర్ మానేరు, వరద కాలువ, అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు అన్ని రిజర్వాయర్లు నీరు లేక నోర్లు వెల్లబెట్టాయని అవేదన వ్యక్తంచేశారు. గోదావరి బేసిన్‌పై ఉన్న ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం దాదాపు 418 టీఎంసీలు కాగా ప్రస్తుతం 86 టీఎంసీల నీరు కూడా లేదని చెప్పారు. సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పరిధిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌటింగ్ పూర్తయినట్టు అధికారులే నివేదికలు ఇచ్చారని గుర్తుచేశారు. కన్నెపల్లి పంపుహౌస్‌లు ఆన్‌చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లను సమాంతరంగా నడిపితే ఎక్కడా సమస్య రాదని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్తున్నారని వివరించారు.
వాతావరణంపై హెచ్చరిస్తే బెల్ట్ ట్రీట్మెంటా?
ఎల్ నినో ప్రభావం ఉన్నదని హెచ్చరించిన వాతావరణ నిపుణులకు బెల్ట్ ట్రీట్మెంట్ చెయ్యాలని ముఖ్యమంత్రి అనడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ ప్రశ్నించారు. తాను రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్‌రెడ్డితో మాట్లాడినట్టు తెలిపారు. ‘మీ కళ్లలో నీళ్లు తిరుగుతుంటే మాకు బాగా అనిపించడం లేదు.. ఏమీ అనుకోవద్దు శ్యామన్నా అని రిక్విస్ట్ చేసిన. ఆయన ఒక మాట అన్నరు. ‘అన్న ఆయనకు తెల్వది కావచ్చు. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తిని. తెలంగాణ రాక ముందే నేను రిటైర్ అయిన. నన్ను పట్టుకొని కాళేశ్వరం పాజెక్టులో అవినీతి జరిగింది. అందులో నువ్వు కూడా ఉన్నవు. చర్లపల్లి జైలుకు పంపిస్తా అంటే బాధనిపించింది’ అని బాధపడ్డరు. శ్యామ్ ప్రసాద్‌రెడ్డి నిజాయితీగా బతికిన ఇంజినీర్. ఆయన రాష్ట్ర హితం గురించి చెప్తుంటే ముఖ్యమంత్రి బట్టకాల్చి మీద వేస్తున్నడు’ అని మండిపడ్డారు. ‘మాపై ఉన్న కోపాన్ని రైతుల మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, రిటైర్డ్ ఇంజినీర్ల మీద చూపెట్టి.. పైశాచికానందం పొందుతామని చూస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. కన్నెపల్లి పంపులన ఆన్ చేయకపోగా.. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల పంపులను కూడా పూర్తిస్థాయిలో నడుపకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కొట్టుకుపోలే
భద్రాచలం కొట్టుకపోతుందని సీఎం చెబుతున్నారంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ‘గోదావరి 500 ఏండ్ల చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 2022 జూలై 22న 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంటే దాదాపు 260 టీఎంసీల నీళ్లు ఒకేసారి మేడిగడ్డ బరాజ్‌పై నుంచి ప్రవహించినా భద్రాచలం కొట్టుకుపోలే’ అని గుర్తు చేశారు. ‘అప్పుడే ఏం జరుగనప్పుడు 9 టీఎంసీల నీళ్లు పోతేనే కొట్టుకుపోతదా? మెడ మీద తలకాయ ఉన్నోడెవడైనా నమ్ముతాడా?’ అని ప్రశ్నించారు.
రైతులు గోసపడుతున్నరు
ఇప్పటికే మోటర్లు కాలిపోతున్నయని రైతులు చెప్తున్నారని, ఓవైపు చెరువులు ఎండిపోతున్నాయని, మరోవైపు నార్లు ముదిరిపోతున్నాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక ఎక్కిరిస్తున్నాయని, మళ్లీ పాత పరిస్థితే వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని కేటీఆర్ వాపోయారు. ఇవన్నీ చూస్తుంటే మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతాయేమోనని భయం కలుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘రాజకీయాలు చివరి ఆరు నెలలు చేద్దాం.. మిగిలిన సమ యం ప్రజలకోసం పనిచేద్దామని రేవంత్‌రెడ్డే ఇటీవల చెప్పిండు. అదే స్పిరిట్‌తో మేము పనిచేస్తున్నం. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్కు వచ్చే ప్రయోజనాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా ఆనాడు బదనాం చేసి.. ఇప్పుడు ఎల్ నినో కరువు పరిస్థితులున్నా పట్టించుకోవడం లేదు. అందుకే మేము రైతుల పక్షాన పో రాటం చేస్తున్నం’ అని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు.
సాగు, తాగునీరివ్వండి : గంగుల
ఎల్ఎండీ పరిధిలోని రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడిన ప్రాంతాలు ఎడారిగా మారే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్ఎండీ సామర్థ్యం 24 టీఎంసీలు అయితే ఇప్పుడు కేవలం 5.6 టీఎంసీల నీరే ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కరీంనగర్లో బూస్టర్ పంపుల ద్వారా నీటిని తీసుకోవాల్సి వస్తున్నదని, నీటి సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. మరో 20 రోజుల తర్వాత తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నదని వాపోయారు. కనీసం తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూడాలని కోరారు. ఎల్ఎండీ కింద ఉన్న మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు.
హైదరాబాద్‌కు నీటి కటకట
ఎల్లంపల్లి సహా ప్రాజెక్టులన్నీ అడుగంటి పో యాయని, నీళ్లు లిఫ్ట్ చేయకపోతే హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఎన్టీపీసీ, జైపూర్ విద్యు త్తు ప్లాంట్లు కూడా ఎల్లంపల్లి నీటిపైనే ఆధారపడి ఉన్నాయని, వాటికి నీటిని సమకూర్చకుంటే విద్యుత్తు విషయంలో తీవ్ర అంతరాయాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇదే విషయాన్ని రిటైర్డ్ ఇం జినీర్లు చెప్తే వాళ్లను చర్లపల్లి జైలులో వేస్తామం టూ ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడని, బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ లాంటి వాళ్లు మాట్లాడితే వాళ్లు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారం టూ విమర్శలు చేస్తున్నాడని, బీఆర్ఎస్ నాయకులను కోసి వారి రక్తం చల్లితే పంటలు పండుతాయని రేవంత్ మాట్లాడటం సముచితం కాదని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి కేవలం బీఆర్ఎస్ వాళ్ల రక్తం కావాలని భావిస్తే.. ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ముప్కాల్‌లో రక్తదానం చేసి తాగునీరివ్వాలని కోరారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదానం చేసి, ఆ రక్తాన్ని రేవంత్‌రెడ్డికి ఇస్తామని బయలుదేరితే వాళ్లను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లో పెట్టారని తెలిపారు. ఇంకా ముఖ్యమంత్రికి రక్తం కావాలంటే.. కరీంనగర్లోనూ రక్తదాన శిబిరం నిర్వహించి అందరం ఇస్తామని చెప్పారు.
రేవంత్‌కు భయం
పంపులు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోస్తే తాము ఇన్నాళ్లూ చెప్పిన విషయాలు అబద్ధాలని తెలిసిపోతుందన్న భయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. అందుకే ఎన్డీఎస్ఏ నివేదికను ముందు పెట్టి రాజకీయ డ్రామా అడుతున్నాడని విమర్శించారు. ‘ప్రజలు తిడుతారనే భయాన్ని వదిలిపెట్టు.. ఒకవేళ పంపులు ఆన్ చేసి రైతులకు అండగా నిలిస్తే.. ముఖ్యమంత్రి ఇన్నాళ్లూ చెప్పిన అబద్ధాలు, బక్వాస్ మాటల జోలికి మేం వెళ్లం’ అని హామీ ఇచ్చారు. కేసీఆర్ చిన్న ఇషారా ఇచ్చినా పంపులు చాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ కేసీఆర్ సంయమనం పాటించాలని చెప్పారని తెలిపారు.
మూడు పంపుహౌస్‌లను సమాంతరంగా,సమన్వయంతో నడుపుతూ పరిమిత స్థాయిలో నీటి నిల్వలు కొనసాగిస్తూ ఎల్లంపల్లికి ఎత్తిపోతలు చేపట్టాలని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్తే వారిని జైల్లో వేస్తా అంటడు. ఎల్ నినో వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తే వారిని బెల్ట్‌తో కొట్టాలంటడు. నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ వాళ్లు కోరితే కేసులు పెడుతా అంటడు.. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్తో
కుమ్మక్కయ్యాడంటడు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి ఏం చెప్తం?
-కేటీఆర్
ఆనాడు మేడిగడ్డ కుంగిపోయిందని కాంగ్రెస్ వాళ్లు చెప్పగానే.. కేవలం రెండు రోజుల్లోనే ఎన్డీఎస్ఏ వచ్చింది. ఆనాడు చెప్పిన అబద్ధాలకు మరో వంద అబద్ధాలు జోడించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అప్పగించింది. ఆ శిఖండి నివేదికను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నడు. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా పంపులు ఆన్ చేసేది లేదని సీఎం చెప్పడం పూర్తి బాధ్యతారాహిత్యం. – కేటీఆర్

కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, సంజయ్ కల్వకుంట్ల, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, మాజీ ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రసమయి