గ్రేటర్ వ్యాప్తంగా సాగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు, ఎన్యూమరేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. ఉన్నతాధికారుల గుడ్డి చర్యలు, ప్రభుత్వ ఆలసత్వం కలిసి చేసిన తప్పిదాలతో ఓటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల్లో ఫారాల పంపిణీ 100శాతం పూర్తి అయినట్లుగా డిజిటల్ డ్యాష్ బోర్డులలో చూపుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 50 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు, బీఎల్వోల వద్దనే కుప్పలుగా పడి ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండానే అధికారులు కాగితాల్లో అన్ని పూర్తి చేసినట్లుగా చూపిస్తుండటంతో.. లక్షలాది మంది అసలైన ఓటర్ల హక్కులు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది.
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : బల్దియా యంత్రాంగం నిర్వాకం ఏ స్థాయిలో ఉందనడానికి బడంగ్ పేట్ సర్కిల్ నాదర్గుల్ డివిజన్ పరిధిలోని ఆల్మాస్గూడలో జరిగిన ఘటననే నిదర్శనం. ఇక్కడి ఒకే ఇంట్లో ఐదు ఓట్లు ఉండగా… ఆ కుటుంబ సభ్యుల ఓట్లను వేర్వేరు బూత్‌లలో చేర్చారు. ఫలితంగా ఆ ఒక్క ఇంటికే ఐదుగురు బీఎల్వోలను కేటాయించాల్సిన దుస్థితి వచ్చింది. వారిలో ఒక్క బీఎల్వో మాత్రమే ఆ ఇంటికి రాగా, మిగిలిన నలుగురు అసలు అటువైపే కాలుమోపలేదు.
ఓటర్లు ఫోన్ చేసిన స్పందించడం లేదు కదా.. కనీసం వార్డు కార్యాలయాఆనికి వచ్చి ఫారాలు తీసుకెళ్లాలంటూ ఉచిత సలహాలకు పరిమితమయ్యారు. నిబంధనల ప్రకారం ప్రతి బీఎల్వో మూడు పర్యాయాలు ఓటర్లు ఇంటికి వెళ్లాలని చెబుతున్నా… క్షేత్రస్థాయిలో అధికారుల సమన్వయ లోపం, బీఎల్వోల ఆలసత్వమో, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఈ ప్రక్రియనే అధ్వాన్నంగా మారిపోయింది. ఫలితంగా గ్రేటర్ వ్యాప్తంగా వార్డు ఆఫీసుల్లో ఎస్ఆర్ఐ ఫారాలు కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఎన్నికల యంత్రాంగం ఆలసత్వం..
ఓకే బూత్‌లో ఓటర్లను స్పష్టంగా ఖరారు చేయడంలో రెవెన్యూ యంత్రాంగం ప్రదర్శించిన ఆలసత్వమే ఈ ప్రక్రియను తలకిందులు చేసిందనే తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల విభజన, ఓటర్ల మ్యాపింగ్ సక్రమంగా చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో బీఎల్వోలు తీవ్రమైన పని ఒత్తిడిలో సతమతమైతున్నారు. ఒక్కో బీఎల్వోకు 1000కిపైగా ఫారాలను పంపిణీ చేయాలనే టార్గెట్ ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అడ్డగోలుగా విధులను అప్పగించడంతోనే సమస్య జఠిలమైందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇంటింటికి తిరగలేక, పోలింగ్ కేంద్రాల్లోనో, లేదా వార్డు ఆఫీసులకే బీఎల్వోలూ తిష్టవేసి కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అద్దె ఇండ్ల ఓటర్లకే తీవ్ర నష్టం..
హైదరాబాద్ లాంటి మహానగరంలో అద్దె ఇండ్లలో ఉండేవారు, జీవనోపాధి కోసం ఇతర కారణాల వల్ల ఒకే నియోజకవర్గంలో అంతర్గతంగా ఇండ్లు మారుతుంటారు. బీఎల్వో లూ కనీసం సదరు ఓటర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోకుండా, పాత ఇంటికి తాళం వేసి ఉందనో, లేదా అక్కడ వారెవరూ లేరనే సాకు తో, నాట్ ట్రేసింగ్ అని నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కనీసం సంబంధిత ఓటర్‌కు మెసేజ్ రూ పంలో కూడా సమాచారం చెరవేయకపోవడంతో… వేల సంఖ్యలో ఓటర్లకు ప్రమాదం పొంచి ఉంది. నిజానికి ఇదే బీఎల్వోల ఆలసత్వం కారణంగా తొలగింపు జాబితా భారీ స్థాయిలో ఉంటుందనీ, ఇం టింటికి వెళ్లాల్సిన అధికారులు ఫారాలను తమ వద్దనే పెట్టుకుని కూర్చోవడంతో ఎంతో మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పో యే ప్రమాదం ఏర్పడింది.
నియోజకవర్గాల సిత్రాలెన్నో..
రెండు నియోజకవర్గాలు కలిసి ఉన్నట్లుగా ఉండే ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. రెం డు నియోజకవర్గాలను వేరు చేయు హద్దుల వెంబడి ఉండే కాలనీల్లో చాలా మంది ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలూ కూర్చుంటే… మరికొంత మంది ఎక్కడో కాలనీల్లో ఓ మూలన కూర్చుకుని ఫారాలను పరిశీలన, స్వీకరణ చేయడంతో ఆయా కాలనీల్లో ఏం జరుగుతుందోనని, తమ ఓటు ఎక్కడ పరిశీలించుకోవాలనే విషయం తెలియక ఎంతో మంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిధిలోనైతే
ఒక ఇంటిలో ఇద్దరు ఓటర్లు ఉంటే… తన భార్యకు ఫారాన్నిచ్చిన అధికారులు… తనకు మాత్రం ఫారం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతూ వార్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఓటర్ వివరించారు. కనీసం స్థానికంగా ఉండే పార్టీల బీఎల్వోలూ అయినా… సంబంధిత ఓటర్‌కు సమాచారం ఇవ్వకపోవడంతో తన ఓటు ఉంటుందో, పోతుందోనని ఆందోళనలో పడ్డారు. తన అపార్ట్మెంట్లో ఉండే 10 ఫ్లాట్లలో ఇదే పరిస్థితి ఉందనీ పేర్కొన్నారు. రోడ్ నెంబర్ 12లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఉన్న పలు పోలింగ్ బూత్‌లలో సుమారు 15వేల మంది ఓటర్లు ఉంటే… ఇక్కడ 99 శాతం ఫారాల పంపిణీ పూర్తి చేసినట్లుగా యాప్‌లో నమోదు చేశారు. కానీ ఒక్కో బీఎల్వో వద్ద ఇంకా 300-400 దాకా ఫారాలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇందులో ఇండ్లు మారిన వారిని షిఫ్టెడ్ కింద చూపిస్తూ… ఆన్లైన్లోనే ఓట్ల తొలగింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనిని బీఎల్వోలూ, రాజకీయ పార్టీ బీఎల్ఏల మీదకి నెట్టేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో బీఎల్వోలు ఒకే చోట కూర్చొని ఓటర్లనే తమ వద్దకు రప్పించకుంటున్నారు. ఇక్కడ 40శాతం ఫారాల పంపిణీ కూ డా కాలేదని తెలుస్తోంది. కానీ డిజిటల్ నమోదులో మాత్రం 99శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లుగా కనిపిస్తోంది. టార్గెట్ పూర్తి చేసే తొందరలో ఇష్టమొచ్చిన తీరుగా వివరాలను నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ 1000 దరఖాస్తుల్లో ఏకంగా 700మందికి డబుల్ ఓట్లు ఉన్నట్లుగా గుర్తించారు. 2002 తర్వాత మృతి చెందిన ఓటర్ల వివరాలను ఆన్లైన్ డేటా నుంచి తొలగించలేదనీ, దీంతో డబుల్ ఓట్లు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
మొరాయిస్తున్న యాప్‌లు..
క్షేత్రస్థాయిలో వినియోగించే యాప్‌లూ కూడా మొరాయిస్తున్నాయి. వీటి వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించలేదనీ, తరుచుగా వచ్చే సాంకేతిక సమస్యలను సిబ్బంది పరిష్కరించలేక చేతులు ఎత్తివేస్తున్నారు. దీంతోపాటు సర్వర్ లోపాలతో తరుచూ మొరాయిస్తున్నాయి. డేటా అప్లోడ్ కాకపోయినా, నెట్వర్క్ రాకపోయినా తప్పుడు డేటానే నిక్షిప్తం చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. డిజిటలీకరణ కూడా జాప్యానికి ఇదే కారణమని కొందరు బీఎల్వోలూ సాకులు చెబుతున్నా.. దీని వెనుక ఉన్నతాధికారుల విధుల పంపిణీలో జరిగిన లోపాలేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. క్షేత్రస్థాయిలో నమోదవుతున్న వివరాల్లో ఉన్న వాస్తవికత ఎంత? అనే అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు ఉన్నాయి. అందుకే కొందరు బీఎల్వోలూ అదనుగా తీసుకుని, వందశాతం ఫారాల పంపిణీ పూర్తయినట్లుగా, సమాచారం నిక్షిప్తంగా శరవేగంగా సాగుతున్నట్లుగా తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

ఓటర్లకు తప్పని తిప్పలు..
ఓటు నమోదు కాకపోయినా, జాబితాలో తప్పులున్నా సరిదిద్దుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్న వృద్ధులు, మహిళలకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా… కొన్ని నియోజకవర్గాల పరిధిలో సర్ కార్యక్రమం జరుగుతుందా? జరిగితే ఏ కాలనీలో అధికారులు ఉన్నారు.? మరీ పక్క కాలనీ వాసులు ఎక్కడికి వెళ్లాలనే ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో అధికారులు వద్ద ఫారాలు కుప్పలు తెప్పలుగా పడి ఉండటానికి కారణమనీ తెలుస్తోంది. కనీసం స్థానిక ప్రజలకు సమాచారం ఇచ్చేవారు లేరనే విమర్శలు ఉన్నాయి. ఎన్నిక సంఘం క్షేత్రస్థాయిలో కనీస అవగాహన, ప్రచారం కల్పించకపోవడంతో అసలైన ఓటర్లు కూడా వార్డు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు. ఇక ఇంటింటి సర్వే జరగకుండా, ఫారాలు పంపిణీ చేయకుండానే షిప్టెడ్ అని రాసి ఓట్లను తొలగించే ప్రయత్నాలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన ఓటర్లు పేర్లు గల్లంతు అయితే భవిష్యత్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది.
తొలగింపు కుట్రలేనా?
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల వ్యాపతగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్రాల వద్దకు వచ్చిన వారికే ఓటు హక్కు అన్నట్లుగా అధికారులు వ్యవహారిస్తున్నారు. బీఎల్వోలూ తమ ఇండ్లకు రాకుండానే, ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే పంపిణీ పూర్తి చేశామని ఎలా ప్రకటిస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. తమ ఓట్లను అక్రమంగా తొలగించేందుకు అధికారుల ఆలసత్వమే ప్రధాన కారణంగా మారుతుందంటున్నారు. తప్పుడు లెక్కలతో తమ ఓటు హక్కును కోల్పోతే ఎవరూ బాధ్యత వహిస్తారని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితమై సజావుగా సాగుతుందనీ, నివేదిక పంపడానికే ఈ కాగితపు లెక్కలనీ స్పష్టం అవుతుంది. ఎన్నికల సంఘం ఇప్పటికైనా క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించి… తొలగింపు కుట్రలకు తావు లేకుండా, గందరగోళంగా మారిన సర్ ప్రక్రియను గాడిలో పెట్టాలని, నిజమైన ఏ ఒక్క ఓటరు కూడా తమ హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.