– రహదారిపైకి చేరిన గోదావరి వరద నీరు
– అప్రమత్తమైన అధికార యంత్రాంగం
– కొల్లు ప్రాంతంలో వరదలో చిక్కుకున్న లారీలు
– బోటు సహాయంతో డ్రైవర్లను రక్షించిన ఉప సర్పంచ్, స్థానికులు
– పునరావాస కేంద్రాలకు వరద బాధితుల తరలింపు
బూర్గంపహాడ్, ఆగస్టు 01 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. శనివారం భద్రాచలం వద్ద మధ్యాహ్నానికి 55.90 అడుగులకు వరదనీటి మట్టం చేరుకోవడంతో పరివాహక ప్రాంతాలైన సారపాక-నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, రెడ్డిపాలెం-బూర్గంపహాడ్, ఇరవెండి- మొండికుంట రహదారులపైకి వరదనీరు చేరి ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో వాహనాల రాకపోకలను అధికారులు, ప్రజాప్రతినిధులు నిలిపివేశారు. మోతే పట్టీనగర్ వద్ద సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు గోదావరి వరదనీరు చేరడంతో గద్దెలు నీటి ముంపునకు గురయ్యాయి. గోదావరి వరద ఉధృతికి బూర్గంపహాడ్ కొల్లు ప్రాంతంలోని చాకలిబజార్, ఎస్సీ కాలనీలు, సారపాకలోని బసప్పక్యాంప్, భాస్కరనగర్ ఎస్టీకాలనీ, పాత సారపాక, కండక్టర్స్ కాలనీల్లోకి వరదనీరు చుట్టుముట్టింది. మోతే పట్టీనగర్‌లో లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు నీట మునిగాయి.

సారపాక రెడ్డిపాలెం, ఇరవెండి మొండికుంటకు రాకపోకలు బంద్
దీంతో ముందుగానే అప్రమత్తమైన మండల అధికార యంత్రాంగం శుక్రవారం రాత్రి నుండి వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేసేందుకు మండల కేంద్రంలోని కేజీబీవీ, మార్కెట్ యార్డులోని రైతు వేదిక, సారపాకలో బీపీఎల్ స్కూల్ వద్ద కళాభారతి, సెయింట్ థెరిస్సా పాఠశాల, తాళ్లగొమ్మూరులోని కల్యాణ మండపం, ఇరవెండిలో యూపీఎస్ పాఠశాల, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని ప్రభుత్వ హైస్కూళ్లను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. మండల వ్యాప్తంగా బూర్గంపహాడ్‌లో 12, సారపాకలో 14, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో 4, మోతేపట్టీనగర్ లో 3 వరద బాధిత కుటుంబాలు పునరావాసం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల బృందంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎస్ఐ మేడా ప్రసాద్, ఎంపీఓ రామకృష్ణ, సర్పంచ్ కిశోర్నాయర్, ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు.

సారపాక రెడ్డిపాలెం, ఇరవెండి మొండికుంటకు రాకపోకలు బంద్
గోదావరి వరద ఉధృతి పెరగడంతో వేలేరు- బూర్గంపహాడ్ మధ్యలో ఉన్న కొల్లు ప్రాంతంలో మూడు లారీలు చిక్కుకున్నాయి. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు కేకలు వేయడంతో అక్కడే సహాయక చర్యల్లో ఉన్న బూర్గంపహాడ్ ఉప సర్పంచ్ గుండె వెంకన్న, స్థానికుడు బబ్బురాయుడు అధికారుల సహాయంతో బోటును ఏర్పాటు చేసి చిక్కుకున్న లారీల ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఎంతో జాగ్రత్తగా వారిని బోటులో ఎక్కించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. లారీ డ్రైవర్లు సురక్షితంగా బయటకు రావడంతో అధికారులు వారిని ప్రత్యేకంగా అభినందించారు.