Cellulite | శరీరంపై ముఖ్యంగా తొడలు, నడుము, పిరుదులు, పొట్ట భాగాల్లో చిన్న చిన్న గుంతల్లా కనిపించే చర్మ మార్పులను సెల్యులైట్ అంటారు. ఇది ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం కాకపోయినా, చాలామందిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే సౌందర్య సమస్యగా భావిస్తారు. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పుల ద్వారా సెల్యులైట్‌ను తగ్గించుకోవడం లేదా నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది. చర్మం ప్రధానంగా ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలతో ఉంటుంది. ఈ పొరల కింద కొవ్వు కణాలు (ఫ్యాట్ సెల్స్) ఉంటాయి. సాధారణంగా ఈ కణాలు సమతుల్యంగా ఉన్నప్పుడు చర్మం మృదువుగా, సమానంగా కనిపిస్తుంది. అయితే కొవ్వు కణాలు పెద్దవిగా మారినప్పుడు అవి చర్మాన్ని బయటకు నెట్టడంతో చిన్న చిన్న గుంతలు ఏర్పడి, వాటినే సెల్యులైట్గా పిలుస్తారు. ఇది ఎక్కువగా తొడలు, నడుము, పిరుదులు, పొట్ట ప్రాంతాల్లో కనిపిస్తుంది.
సెల్యులైట్ పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అయితే మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం మహిళల చర్మం పురుషులతో పోలిస్తే పలుచగా ఉండటం, చర్మం కింద కొవ్వు నిల్వలు చిన్న చిన్న విభాగాలుగా ఉండడమే. మహిళల శరీరంలో సహజంగానే కొవ్వు శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చర్మం కింద కొవ్వు నిల్వలు ఎక్కువగా ఏర్పడి సెల్యులైట్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి మహిళా హార్మోన్లు కూడా సెల్యులైట్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్ల ప్రభావం వల్ల కొవ్వు నిల్వలు, రక్తప్రసరణలో మార్పులు చోటుచేసుకుని సెల్యులైట్ మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. సెల్యులైట్‌ను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజుకు మూడు సమతుల్య భోజనాలు తీసుకోవాలి. ఆకుకూరలు, ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ, కార్బొహైడ్రేట్లు, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తగ్గించడం మంచిది. అలాగే ప్రాసెస్ చేసిన, నిల్వ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
శరీరంలోని తొడలు, నడుము, పిరుదుల కండరాలు దృఢంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వారానికి కనీసం ఐదు రోజులు, రోజుకు సుమారు 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. వెయిట్ ట్రైనింగ్‌తోపాటు ఎరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల కొవ్వు నిల్వలు తగ్గి సెల్యులైట్ తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తగినంత నీరు తాగడం కూడా ఎంతో అవసరం. శరీరం తగినంత హైడ్రేట్‌గా ఉంటే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మసాజ్ చేయడం వల్ల సెల్యులైట్ పూర్తిగా తొలగిపోదు. అయితే ప్రభావిత ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడి కొవ్వు, వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పేరుకుపోకుండా సహాయపడుతుంది. స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనెతో మృదువుగా మసాజ్ చేయడం వల్ల చర్మం కూడా మృదువుగా ఉంటుంది. డ్రై స్కిన్ బ్రషింగ్ కూడా ఉపయోగకరమైన పద్ధతిగా భావిస్తారు. ఇది లింఫాటిక్ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు, చర్మం కింద ఉన్న కొవ్వు నిల్వలను మృదువుగా చేయడంలో కొంతవరకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.