Flash floods : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloud burst) సంభవించింది. రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్త్రధారలో వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు. వరదతోపాటు వచ్చిన బురద, ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి.
రహదారులపైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. రిషికేశ్‌లో చంద్రభాగనది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో పడి ఐదుగురు కొట్టుకుపోయారు. నది వరదలో చిక్కుకున్న మరో ముగ్గురిని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు.
అదేవిధంగా తమ్సా, టన్స్, సాంగ్ నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం కల్పించాయి.