ఇస్లామాబాద్: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత మిలిటరీ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను ఆ దాడితో ధ్వంసం చేశారు. అయితే ఆ భీకర దాడిలో ఉగ్రవాది మసూద్ అజార్(Masood Azhar)కు చెందిన కుటుంబం ముక్కలైపోయిందని జైషే మొహమ్మద్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ అంగీకరించాడు. బహవల్పూర్లో ఉన్న మసూద్ అజార్ ఇంటిని ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పేల్చి వేశారు.
జైషే కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. భారతీయ ఆర్మీ ఎలా తమ స్థావరంపై దాడి చేసిందన్న విషయాన్ని ఆ వీడియో ప్రసంగంలో అతను వెల్లడించాడు. ఉగ్రవాదం బాటలో ముందుకు వెళ్లామని, ఢిల్లీ.. కాబూల్.. కాందహార్‌లో పోరాడామని, ఈ దేశ సరిహద్దులను రక్షించుకున్నామని, సర్వస్వం త్యాగం చేశామన్నాడు.
కానీ మే 7వ తేదీన భారత బలగాలు చేసిన దాడిలో మౌలానా మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయిందని జైషే కమాండర్ కశ్మీరీ తన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఉర్దూ భాషలో అతను మాట్లాడాడు. అతను ప్రసంగిస్తున్న సమయంలో అతని వెనుక గన్నుల పట్టుకుని సెక్యూర్టీ సిబ్బంది ఉన్నారు.
🚨 #Exclusive 🇵🇰👺
Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar’s family was torn into pieces in Bahawalpur attack by Indian forces.
Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy
— OsintTV 📺 (@OsintTV) September 16, 2025
పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. పాక్‌లో ఉన్న జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశారు. బహవల్పూర్, కోట్లి, మురిదికేతో పాటు మొత్తం 9 స్థావరాలను పేల్చివేశారు. పాక్‌లో 12వ అతిపెద్ద నగరం బహవల్‌పుర్ . జైషే ఉగ్ర సంస్థ కార్యకలాపాలకు ఆ ప్రాంతం కీలకంగా నిలిచింది. లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఆ పట్టణం ఉన్నది. జైషే ప్రధాన కార్యాలయం జామియా మజీద్ సుభాన్ అల్లా అక్కడే ఉన్నది. దీన్నే ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు.