న్యూఢిల్లీ : ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగి, సొంతంగా సంపాదించుకోగలిగే సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామికి శాశ్వత భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం కింద భరణం అనేది సామాజిక న్యాయం కోసం ఉద్దేశించిన చర్య అని, ఆర్థికంగా బలవంతులైన వ్యక్తులు ధనవంతులుగా మారేందుకు సాధనం కాదని కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పుచెప్పింది.
భరణం కోరేవారు ఆర్థికసాయం అవసరం తమకు నిజంగా ఉందని నిరూపించుకోవాలని వ్యాఖ్యానించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను, భార్యకు శాశ్వత భరణాన్ని నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ కేసులో భర్త వృత్తిరీత్యా న్యాయవాది కాగా, భార్య రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ గ్రూప్-ఎ అధికారిగా పనిచేస్తున్నారు. కేవలం 14 నెలలపాటు కలిసి ఉన్న ఈ దంపతులు విడిపోయేందుకు భార్య ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్టు కోర్టు గుర్తించింది.