HDFC Bank | ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా ఉద్యోగాల కోతలు ఉండబోవని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో శశిధర్ జగదీశన్ వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంకులో జెనరేటివ్ ఏఐ సహా పలు టెక్నాలజీకి సంబంధించిన ప్రయోగాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. వాటి ఫలితాలు 18 నుంచి 24 నెలల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. రెండో త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ వినియోగం వల్ల ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని తెలిపారు. ఇంకా చెప్పాలంటే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీలో ఏఐ వినియోగం వల్ల ఉద్యోగులకు గొప్ప అవకాశం దక్కుతుందని సీఈవో శశిధర్ జగదీశ్ తెలిపారు. బ్యాక్ఎండ్ పనులు తగ్గించుకుని, ఆ సిబ్బందిని ఫ్రంట్ ఎండ్‌లో అలాగే టెక్ విభాగాల్లో ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం బ్యాంకులో AIను నిర్ణయాలు తీసుకునే సాధనంగా కాకుండా, ప్రక్రియల మెరుగుదల కోసం ఉపయోగిస్తున్నారని శశిధర్ జగదీశ్ తెలిపారు. టర్న్‌రౌండ్ టైమ్ తగ్గించడం, సేవలను సులభతరం చేయడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాక్ఎండ్లో సామర్థ్యం పెరిగిన తర్వాత, ఆ సిబ్బందిని నేరుగా కస్టమర్లతో మమేకమయ్యే విధానాల్లో వినియోగిస్తామని స్పష్టం చేశారు.
బ్యాంకింగ్‌లో పలు ఏఐ ప్రయోగాలు సక్సెస్ కాలేకపోయినప్పటికీ వాటిలో నుంచి నేర్చుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. వచ్చే 18 నుంచి 24 నెలల్లో ఈ ప్రయోగాల ఫలితాలు కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐ అంటే ఉద్యోగాల కోత కాదని.. బ్యాంకింగ్ రంగంలో నూతన బాధ్యతలు, సరికొత్త అవకాశాలకు నాంది అని స్పష్టం చేశారు.