ఒకానొక సందర్భంలో క్రీస్తును గొర్రెపిల్లతో పోల్చారు. సృష్టిలో మహోన్నత సృష్టి ఎవరంటే.. ఉన్నతమైన మనసు, మాట ఉన్న మానవుడే అని సమాధానం వస్తుంది. కాబట్టి సృష్టికి అన్ని విధాలా ఏలికగా ఉన్నవాడు మానవుడే! మానవ జన్మ అన్నిరకాలుగా చాలా ఉత్కృష్టమైనది. మానవుడే మహారాజు! అయితే, క్రీస్తును గొర్రెపిల్లతో ఎందుకు పోల్చారో అన్న సందేహం తలెత్తుతుంది. ఈ పోలికను ఎవరు ఎక్కడ అన్నారూ ? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. క్రీస్తు కన్నా ఏడెనిమిది నెలలు పెద్దవాడైన యోహాను (ఎలిజబెత్ కుమారుడు).. తనవైపు నడుచుకుంటూ వస్తున్న క్రీస్తును చూస్తూ.. ‘ఇదిగో ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల’ అని అన్నాడు. అలాగే శిష్యాగ్రణి పేతురు కూడా ప్రజల్ని సంబోధించి మాట్లాడుతూ ‘గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేతనే మనం విమోచనం పొందినాము’ అని ప్రకటించి, క్రీస్తును గొర్రెపిల్లతో పోల్చాడు.
గొర్రెపిల్ల వినయానికి సంకేతం. ప్రభువును తండ్రి మాట నెరవేర్చిన వినయశీలిగా దర్శించారు ఆయన శిష్యులు. గొర్రెపిల్ల తన యజమాని వెంట ఏ మాటా లేకుండా, మౌనంగా తలొంచుకొని వెళ్లిపోతుంటుంది. పరుల తృప్తి కోసం ప్రాణాలు త్యాగం చేస్తుంది. ప్రభువులోనూ ఈ లక్షణాలు ఉన్నాయి. తండ్రి మాటను తు.చ. తప్పకుండా నెరవేర్చిన వినయం ఒకటైతే! అందరి కోసం తన ప్రాణాలను విడిచిన త్యాగ గుణం మరొకటి. ఈ రెండు గుణాలూ ప్రభువును గొర్రెపిల్లతో పోల్చడానికి ఉపకరించే లక్షణాలు. ఈ పోలిక కొందరికి నచ్చకపోయినా… అందులోని ఆంతర్యాన్ని దృష్టిలో ఉంచుకొని, సారాంశానికి ప్రాధాన్యం ఇచ్చి క్రీస్తు ఔన్నత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి.