హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హామీలన్నీ అమలయ్యేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. అత్యధికంగా బీసీ విద్యార్థులు లబ్ధిపొందే ఫీజు రీయింబర్స్మెంట్, పూలే స్కాలర్షిప్ నిధుల విడుదల జాప్యంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభు త్వం వాటికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో బీసీ సంక్షేమానికి ఎంతఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు బొల్లా శివశంకర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు కొట్టాల యాదగిరిముదిరాజ్, దాసరి నరేశ్ముదిరాజ్, నాగభూషణంముదిరాజ్, భిక్షపతిముదిరాజ్, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ అండ్ ఫౌండర్ విశ్వనాథుల పుష్పగిరి, జాతీయ సహాయ కార్యదర్శి చొల్లేటి ప్రభాకర్, అబ్బోజు రామ్ సుధాకరాచారి, హేమ జిల్లోజు, స్తపతి, నరేశ్చారి పాల్గొన్నారు.