Tragedy | భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టటింది. భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమవ్వగా.. తండ్రి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కృష్ణ (32), సవిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు రక్షిత్ (8), అనన్య (5) ఉన్నారు. కొంతకాలంగా సవితతో కృష్ణకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురై కృష్ణ ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతానికి వెళ్లాడు.
అక్కడ ఇద్దరు పిల్లలను నిజాంసాగర్‌లోకి నెట్టి, కృష్ణ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రక్షిత్, అనన్య మృతదేహాలను వెలికితీశారు. కృష్ణ ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు కృష్ణ మృతదేహం కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.