జడ్చర్లటౌన్, ఆగస్టు15 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ కథనం ప్రకారం .. ఏపీలోని కడప నుంచి 35 మంది ప్రయాణికులతో సీజీఆర్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు జడ్చర్ల మండలం మాచారం శివారులోకి రాగానే ఓవర్టేక్చేసే యత్నంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నది.
దీంతో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నరసింహ (50)తోపాటు డ్రైవర్ సీటు వెనుక కూర్చొన్న మరో ఇద్దరు ప్రయాణికులు (కూకట్పల్లి ప్రాంతానికి చెందిన అత్తాకోడళ్లు లక్ష్మీదేవి(65), రాధిక(49)) అక్కడిక్కడే మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బస్సు క్లీనర్ నర్సింహ (25) మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.