మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గత 15 రోజుల నుంచి యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారు. టోకెన్లు ఇచ్చి యూరియా ఇవ్వకపోవడంతో అసహనంతో రగిలిపోయిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున యూరియా కోసం చేరుకున్న రైతులు అక్కడ యూరియా లేదని తెలిసి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా పాత బస్టాండ్ ముందు బైఠాయించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో అక్కడి నుంచి నినాదాలు చేస్తూ కొత్త బస్టాండ్ చేరుకొని హైదరాబాద్- మహబూబ్నగర్ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
దీంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. బస్టాండ్ ఎదురుగా రైతులు ఆందోళనకు దిగడంతో బస్సులన్నిటిని వేరే రూట్ ల నుంచి మళ్లించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా రైతులకు యూరియా లభించకుండా చేస్తుందని విమర్శించారు. వందలాది మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే యూరియా కొరతలేదని చెప్పడానికి ప్రభుత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తుందని మాజీ మంత్రులు ఆరోపించారు.
రైతులు నిజంగా యూరియా కోసం వస్తే వాళ్లంతా పార్టీ కార్యకర్తలు అంటూ అవమానిస్తున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే ఇక్కడికి రండి.. రైతుల గోస వినండి అంటూ సవాల్ విసిరారు. యూరియా కొరతపై రైతుల ఆగ్రహావేశాలను తెలుసుకున్న మాజీ మంత్రులు హుటాహుటిన ఫోన్లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు పిలిపించారు. యూరియా కొరత ఉన్నది వాస్తవమేనని.. అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో వచ్చిన స్టాక్ వచ్చినట్లే ఇస్తున్నామని చెప్పారు. డిమాండ్ కు తగ్గట్టు సప్లై లేకపోవడం వల్లే ఇది జరుగుతుందని ఒప్పుకోవడం గమనార్హం. అయితే డిఎస్పి రైతుల వద్దకు చేరుకుని బీఆర్ఎస్ నేతలను సముదాయించి అక్కడ నుంచి పంపించి ఆందోళన విరమింప చేశారు.