ఆదిలాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోళ్ల గడువును మరో ఐదు రోజులు పెంచడంతో వందలాది వాహనాల్లో రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. సీసీఐ అధికారులు, సిబ్బంది నాణ్యత సరిగా లేదంటూ చాలా మంది పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పత్తి వాహనాలను కాంటాలపై నిలిపివేసి కొనుగోళ్లు జరగకుండా అడ్డుకున్నారు.
సీసీఐ అధికారులు కొనుగోళ్లు ప్రారంభం నుంచి ఇబ్బందులు పెడుతున్నారని, తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత సరిగా లేదంటూ మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదని, దీంతో తాము ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను షరతులు లేకుండా కొనుగోలు చేసేంత వరకు వాహనాలను కాంటా నుంచి తీయమని స్పష్టం చేశారు.
రైతుల ఆందోళన ఫలితంగా దాదాపు మూడు గంటలపాటు మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు నిలిచాయి. పత్తిని ఎందుకు కొనడం లేదంటూ రైతులు సీసీఐ అధికారులను మార్కెటింగ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన తాము, ప్రైవేటులో విక్రయించి నష్టపోవాల్సి వస్తున్నదని సీసీఐ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నెల రోజుల ముందుగానే కొనుగోళ్లను నిలిపివేసి మరో ఐదు రోజులు పొడిగించి నాణ్యత సరిగా లేదంటూ ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో సీసీఐ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లను ప్రారంభించారు.
రైతులు కష్టపడి పండించిన పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ అధికారులు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు. సోమవారం పత్తిని కొంటామని ప్రకటించి, తీరా నాణ్యత సరిగా లేదంటూ తిరస్కరిస్తు న్నారు. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు సీసీఐ అధికారుల తీరుతో నష్టపోవాల్సి వస్తున్నది. వాహనం కిరాయి, లేబర్ చార్జీలు తడిసి మోపడవుతున్నాయి. ఇప్పటికే మద్దతు ధరలో రూ.100 తగ్గించి కొంటున్న సీసీఐ నాణ్యత లేదంటూ తిరస్కరించడంతో ప్రైవేటు వ్యాపారులకు రూ.6500 విక్రయించి నష్టపోవాల్సి వస్తున్నది. సీసీఐ రైతులకు అండగా నిలువాల్సి ఉండగా.. ప్రైవేటు వ్యాపారుల కంటే ఎక్కువ వ్యాపారం చేస్తున్నది.
– సంతోష్, రైతు, మాండగడ, భోరజ్ మండలం
నేను నాలుగు రోజుల కిందట 35 క్వింటాళ్ల పత్తిని విక్రయించా. స్లాట్ బుకింగ్ లేక ఈ రోజు మరో 30 క్వింటాళ్లు తీసుకొచ్చా. పత్తిలో దూదిపింజ లేదంటూ సీసీఐ సిబ్బంది కొనమని అంటున్నారు. నాలుగు రోజుల కింద అమ్మగా మిగిలిన పత్తిని తీసుకొస్తే పింజ లేదని అనడం ఎంతవరకు నిజం. రైతులు కష్టపడి పండించిన పత్తిని కొనుగోలు చేయాల్సిన సీసీఐ పనికిమాలిన సాకులు చెబుతూ కొనడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు, ఎరువులు వాడినం. మేము సొంతగా ఏమీ తయారు చేయలేదు. ఇందులో రైతుల తప్పు ఏమీ ఉంటుంది. సీసీఐ అధికారుల తీరుపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకుని రైతులు నష్టపోకుండా చూడాలి.
– తోట లక్ష్మణ్, రైతు, భీంసరి, ఆదిలాబాద్ రూరల్ మండలం