ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 23: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జిల్లాలో నిరుడు 97 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది ఒక పరీక్ష కేంద్రం పెరిగింది. మార్చి 14న ప్రారంభమయ్యే పరీక్షల కోసం అధికారులు జిల్లావ్యాప్తంగా 98 కేంద్రాలను ఎంపిక చేశారు. ఖమ్మంలో ఒక పరీక్షా కేంద్రం పెరగగా అత్యధికంగా ఖమ్మం నగరంలోనే కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా మండలాల్లో కేంద్రాలను ఎంపిక చేశారు.
సీఎస్, డీవోల ఉత్వర్వుల అందజేత..
పరీక్షల నిర్వహణలో కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు(డీవో)లను నియమిస్తూ విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు అందజేశారు. జిల్లాలో 98 కేంద్రాలుండగా ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సీఎస్, ఒక డీవోను నియమించారు. వారికి అందజేసిన ఉత్తర్వుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందుపరిచారు. ఈ ఏడాది పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్కాడ్‌ను నియమించనున్నారు. విద్యాశాఖేతర విభాగాల నుంచి ప్రతి కేంద్రానికి సిట్టింగ్ స్కాడ్‌ను నియమించనున్నారు. ఇతర విభాగాల నుంచి అధికారుల వివరాలు రెండ్రోజుల్లో విద్యాశాఖకు అందనున్నాయి. గతంలో అత్యధికంగా వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల నుంచి కేటాయించారు.
ఇన్విజిలేషన్‌కు కసరత్తు..
టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ ఎంపిక ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో కేంద్రంలో 11 మంది నుంచి 14 మంది వరకు ఇన్విజిలేటర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇన్విజిలేషన్ చేసే ప్రక్రియలో హెచ్ఎం మినహా సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తున్నారు. 1,400 మంది అవసరమని అంచనా వేస్తూ అదనంగా మరో 100 మందిని గుర్తిస్తున్నారు. ఒకటీ రెండ్రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ఉత్తర్వులు అందజేయనున్నారు. ఇప్పటికే ఎంఈవోలు, హెచ్ఎంల నుంచి వివరాలు సేకరించారు. లాంగ్వేజీ పరీక్షలకు నాన్ లాంగ్వేజీ ఉపాధ్యాయులను, నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు లాంగ్వేజ్ ఉపాధ్యాయులను నియమిస్తున్నారు.
నేడు సీఎస్, డీవోల సమావేశం..
టెన్త్ పరీక్షల నిర్వహణపై మంగళవారం నాడు కలెక్టరేట్లో సీఎస్, డీవోల సమావేశం నిర్వహించనున్నారు. సీఎస్, డీవోలతోపాటు సీ సెంటర్, పేపర్ కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు, ఎంఈవోలు హాజరుకానున్నారు. సుమారు 250 మంది వరకు సమావేశానికి హాజరుకానున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ డీఈవో చైతన్యజైనీ వివరించనున్నారు.
టెన్త్ పరీక్షలకు పకడ్బందీఏర్పాట్లు: ఏసీ
ఖమ్మం జిల్లాలో టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ (ఏసీ) శ్రీనివాసరెడ్డి తెలిపారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 6 ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఫ్లయింగ్ స్కాడ్‌లో డిప్యూటీ తహసీల్దార్, ఎస్ఐ సభ్యులుగా ఉండాలని సూచించారు. విద్యాశాఖ ఏడీ చావా శ్రీనివాస్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వై లక్ష్మి ప్రసాద్, వివిధశాఖల అధికారులు రామారావు, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ పరీక్షలకు 73 కేంద్రాలు
కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఫిబ్రవరి 23: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జిల్లాలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో భద్రాద్రి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 12,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లను నియమించినట్లు తెలిపారు.
పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూముల్లో ఉంచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163బీ సెక్షన్ అమలు చేయాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు కొనసాగనున్న ఈ పరీక్షల కోసం పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విధుల్లో పాల్గొనే అధికారులు విధిగా ఐడీ కార్డులు ధరించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఈవో నాగలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శంబుప్రసాద్, పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, ఎంఈవోలు, హెచ్ఎంలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.