తిరుమలయపాలెం మే, 4 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని పిండిప్రోలులో ఖమ్మం -వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. గంటన్నరసేపు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
విష యం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెళ్లి రైతు నాయకులతో చర్చలు జరిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫోన్లో రైతులతో మాట్లాడారు. రైతుల పంటలను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు బిల్లగిరి ధనుంజయ,చామకూరి రాజకుమార్, జక్కుల వీరన్న, గుంటి పుల్లయ్య, చిర్ర కృష్ణయ్య, వార్డు సభ్యులు రెడ్డి మల్ల నరేందర్, పులిగుజ్జు ఉపేంద్రమ్మ పాల్గొన్నారు.